వ్యవసాయ పంటలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:25 PM
గిరిజన ప్రాంతంలో వ్యవసాయ పంటల సాగుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాలో కొంత కాలంగా ఉద్యాన, సుగంధ ద్రవ్య పంటలు కాఫీ, మిరియాలు, పసుపు, అల్లంతో పాటు డ్రాగన్‌ఫ్రూట్, ఆవకాడో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
వాతావరణ ఆధారిత సాగుకు ప్రోత్సాహం
ముందస్తు రబీలో వలిసెలు, రాజ్‌మా విస్తీర్ణం పెంపునకు ప్రణాళిక
అధిక దిగుబడులు సాధించేందుకు సాంకేతిక సహకారం
రాయితీపై విత్తనాల పంపిణీ
చింతపల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో వ్యవసాయ పంటల సాగుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాలో కొంత కాలంగా ఉద్యాన, సుగంధ ద్రవ్య పంటలు కాఫీ, మిరియాలు, పసుపు, అల్లంతో పాటు డ్రాగన్‌ఫ్రూట్, ఆవకాడో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాలక్రమంగా వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వ్యవసాయశాఖ వాతావరణ ఆధారిత వ్యవసాయ పంటలను రైతులు సాగు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆర్గానిక్ పంటల సాగుకు అనువైన ప్రాంత భూములు కేవలం అల్లూరి జిల్లాలో మాత్రమే ఉన్నాయని నిపుణుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ఆర్గానిక్ హబ్‌గా ప్రకటిస్తూ గిరిజన రైతులు వ్యవసాయ ప్రగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. గిరిజన ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆదివాసీ రైతులు 1.54 ఎకరాల్లో వ్యవసాయ పంటలను పండిస్తున్నారు. గత పదేళ్లలో పరిశీలిస్తే గిరిజన ప్రాంతంలో వరి విస్తీర్ణం స్థిరంగా ఉన్నప్పటికి చిరుధాన్యాలు, మొక్కజొన్న, వలిసెలు, రాజ్‌మా, కంది, వేరుశనగ విస్తీర్ణం భారీగా తగ్గింది. కొమ్ముశనగను పూర్తిగా పండించడం లేదు. దీంతో ఈ వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు రైతులకు సుస్థిరమైన ఆదాయం సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా రాగి(చోడి), సామ, కొర్ర, జొన్న, సజ్జ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్ మిషన్ అమలులోకి తీసుకురానున్నది. గత ఐదేళ్లలో పడిపోయిన వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం రెండేళ్లలో 30-40శాతం వ్యవసాయశాఖ పెంచింది. ఈ ఏడాది గిరిజన రైతులు మొక్కజొన్న 2,387 హెక్టార్లు, రాగి 15.217, సామ 2.462, కొర్ర 59, కంది 472, వేరుశనగ 2,065హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది మరో 20 శాతం సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
కొమ్ముశనగ, వేరుశనగ సాగుకు ప్రోత్సాహం
మన్యంలో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పంటలైన కొమ్ముశనగ, వేరుశనగ పంటలను పరిచయం చేసేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబరులో తొలిసారిగా వ్యవసాయశాఖ గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసింది. దీంతో రెండు వేల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ 5,162 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు వేల్యూ చెయిన్ క్లస్టర్(వీసీసీ) పథకం ద్వారా శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. రబీలోనూ మూడు వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసుకునేందుకు శతశాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేయనున్నారు. అలాగే కొమ్ముశనగను ఐదు వందల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొమ్ముశనగ విత్తనాలను వ్యవసాయశాఖ 90 శాతం రాయితీపై అందించనున్నది.
వలిసెలు, రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంపు
ప్రతికూల వాతావరణం, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేక గిరిజన ప్రాంతంలో వలిసెలు, రాజ్‌మా సాగు విస్తీర్ణం గత ఆరేళ్లలో గణనీయంగా పడిపోయింది. 2025లో వ్యవసాయశాఖ రాజ్‌మాకు పునరుజ్జీవమిస్తూ నాణ్యమైన విత్తనాలను 90 శాతం రాయితీపై పంపిణీ చేసి సాగు విస్తీర్ణాన్ని పెంచింది. ఈ ఏడాది ముందస్తు రబీలో వలిసెలు, రాజ్‌మా సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో వలిసెలు పంట 150 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. దీంతో వలిసెల సాగు విస్తీర్ణం 500 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా చేసుకున్నారు. విత్తనాలను సైతం వీసీసీ పథకం ద్వారా శతశాతం రాయితీపై రైతులకు అందించనున్నారు. అలాగే రాజ్‌మా పంటను 2025-26లో రైతులు 45 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. రైతులకు 4,900 క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలను 90 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ ఏడాది జిల్లాలో 60 వేల ఎకరాల్లో రాజ్‌మా సాగు చేపట్టేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలను ముందస్తు రబీలో రాయితీపై రైతులకు పంపిణీ చేసేందుకు అనుమతినిచ్చింది. గత ఏడాది కంటే రాజ్‌మా సాగు విస్తీర్ణం 15 వేల ఎకరాలు పెరగనుంది.