వ్యవసాయ ప్రగతికి పెద్దపీట
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:09 AM
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతుల వ్యవసాయ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు తెలిపారు. బుధవారం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించారు.
రసాయనిక ఎరువుల వినియోగం భారీగా తగ్గింపు
ఖరీఫ్‌లో 1.54 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు
చింతపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతుల వ్యవసాయ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు తెలిపారు. బుధవారం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించారు. వ్యవసాయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం చౌడుపల్లి, వామగెడ్డ, గంజిగడ్డ గ్రామాల్లో రాగి, వేరుశనగ, వరి, రాజ్‌మా పంటలను పరిశీలించారు. రాజ్‌మా పంటకు నానో యూరియా పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జిల్లాను ఆర్గానిక్ జోన్‌గా ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో పంటలన్నీ సేంద్రీయ పద్ధతిలో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు వాస్తవంగా 35 వేల టన్నుల రసాయనిక ఎరువులు అవసరమని, గత ఏడాది కేవలం 1,400 టన్నులు వినియోగించామన్నారు. ఈ ఏడాది కూడా రైతులకు 1,400 టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు. సేంద్రీయ పద్ధతిలో పంటలు సాగు చేసేందుకు అనువుగా పచ్చిరొట్ట ఎరువులు జీలుగ, కట్టెజనుము, పిల్లిపెసర విత్తనాలు జిల్లా వ్యాప్తంగా 950 క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్‌లో రైతులు 1.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారన్నారు. వరి 98.8 వేల ఎకరాలు, మొక్కజొన్న 5,980, సామ 6.155, రాగి(చోడి) 38 వేలు, వేరుశనగ 5.162, కంది 1,100 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. రైతులకు రాయితీపై వేరుశగన, రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేశామని తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంపొందించేందుకు ఎస్‌ఎంఏఎం పథకం ద్వారా జిల్లాలో రైతులకు రూ.ఆరు కోట్ల విలువైన యంత్రపరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 1,437 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, రైతులకు రూ.2.1 కోట్లు రాయితీ వర్తిస్తుందన్నారు. రైతులకు లాటరీ పద్ధతి ద్వారా పరికరాలు అందజేస్తామని చెప్పారు. రైతులు సంప్రదాయ పద్ధతులను విడిచిపెట్టి వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను పాటించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చునన్నారు. అలాగే రైతులు డీ-కృషి యాప్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు బీవీ తిరుమలరావు, చింతపల్లి వ్యవసాయ అధికారులు టి.మధుసూదనరావు, అభ్యుదయ రైతు కోరాబు కరుణానిది, మంగ్లు, అప్పారావు పాల్గొన్నారు.