ప్రోటీన్ ఫుడ్‌కు ప్రాధాన్యం
ABN , Publish Date - May 31 , 2026 | 12:47 AM
ఆరోగ్యం పట్ల నగరవాసుల్లో శ్రద్ధ పెరుగుతోంది. అందుకే ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకునేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు.
వినియోగం పెంచిన నగరవాసులు
‘స్విగ్గీ’ ఇన్‌స్టామార్ట్ నివేదికలో వెల్లడి
గడిచిన రెండేళ్లలో 150 శాతం మేర పెరిగిన ఆర్డర్లు
తొలి స్థానంలో గుడ్లు, పన్నీర్, ఆ తరువాత చికెన్, వేయించిన శనగలు
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
ఆరోగ్యం పట్ల నగరవాసుల్లో శ్రద్ధ పెరుగుతోంది. అందుకే ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకునేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రోటీన్ ఆహారం తీసుకోవడం 150 శాతం మేర పెరిగినట్టు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
అగ్ర స్థానంలో గుడ్లు, పన్నీర్
ఈ సంస్థ వెల్లడించిన గణాంకాలు ప్రకారం గడిచిన రెండేళ్లలో ప్రోటీన్ కలిగిన ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. ఈ జాబితాలో గుడ్లు, పన్నీర్, వాటి తరువాత స్థానంలో చికెన్, శనగలు ఉన్నాయి. ముఖ్యంగా వేయించిన శనగలను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఓట్స్, పోహా వంటివి కూడా తీసుకుంటున్నారు. రోజువారీ చూస్తే గ్రీక్ యోగర్ట్ (ప్రత్యేక పెరుగు)ను కూడా ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే ఫిట్‌నెస్ కోసం మాత్రమేనని అంతా భావించేవారు. అయితే, ఆరోగ్యంగా జీవించడానికి ప్రోటీన్ అవసరమని చాలామంది గుర్తిస్తున్నారడానికి పెరుగుతున్న ఆర్డర్లు నిదర్శనమని సదరు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఉదయమే ఆర్డర్లు అధికం
ప్రోటీన్ ఉత్పత్తులైన పప్పులు, శనగలు, రాజ్‌మా, సోయాబీన్, పెరుగు, పాలు, పనీర్, బాదం, జీడిపప్పు, ఓట్స్, క్వినోవా, గుడ్లు, చికెన్, చేపలు, ఓట్స్ వంటి ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను ఉదయం ఏడు నుంచి 11 గంటల మధ్య ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ప్రోటీన్ ఆహార ఉత్పత్తులకు సంబంధించి వచ్చే ఆర్డర్స్‌లో 70 నుంచి 80 శాతం వరకు ఈ సమయంలోనే ఉంటుండడం గమనార్హం. అంటే ఉదయం ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిరోజు ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాల కోసం వందల సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. వారాంతమైన శనివారం, ఆదివారాల్లో ప్రోటీన్ అధికంగా ఉండే మాంసాహార ఉత్పత్తులకు సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో గుడ్లు, చికెన్ ఉంటున్నాయి.
ఆరోగ్యానికి కీలకం
ఆరోగ్యానికి ప్రోటీన్ ఫుడ్ ఎంతో కీలకం. కండరాల బలానికి, పిల్లల్లో ఎత్తు, బరువు, ఎదుగుదలకు అవసరం. అలాగే, శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు ప్రోటీన్ ఉపయోగపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రోటీన్ ఫుడ్ అవసరం. జట్టు రాలడం, ఒంట్లో బలహీనత తగ్గించడంలో ప్రోటీన్ దోహదం చేస్తుందని, ఆకలి ఎక్కువ సేపు వేయకుండా ఉండడానికి, బరువు నియంత్రణకు ప్రోటీన్ దోహదం చేస్తుందని వైద్యులు చెబుతుండడంతో నగరవాసులు కూడా ఈ ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
వసతి గృహాల్లో సీట్ల భర్తీకి కసరత్తు
విద్యార్థుల తల్లిదండ్రులతో వార్డెన్లు, అధికారుల సమావేశాలు
ఫలితాలు, ర్యాంకులపై ఫ్లెక్సీలు
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించేందుకు అధికారులు సరికొత్త పంథాను అవలంబిస్తున్నారు. జిల్లాలో బీసీ, సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 53 వసతి గృహాల్లో 1,200 సీట్లు ఖాళీగా ఉండడంతో వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేయడంపై అధికారులు దృష్టిసారించారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో వార్డెన్లు, ఇతర అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వసతి గృహాల్లో ఉంటూ టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, వసతి గృహాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను కూడా ఇందుకు వినియోగించుకుంటున్నారు. వసతి గృహాల్లో చేరేందుకు ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు...అన్ని హాస్టళ్లలో సీట్లన్నీ భర్తీ అయ్యేలా చూడాల్సిందిగా వార్డెన్లకు ఆదేశాలను జారీ చేశారు.
గృహగణనకు గడువు పొడిగింపు
వచ్చే నెల ఆరో తేదీ వరకూ అవకాశం
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణనకు జూన్ ఆరో తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. ముందుగా పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం శనివారంతో గృహగణనను ముగించాల్సి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో పూర్తికాకపోవడంతో మరో వారం అవకాశం ఇచ్చింది. జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల పరిధిలో 82,247 ఇళ్లలో 2,07,699 మంది జనాభా ఉంటారని తొలుత అంచనా వేశారు. శనివారం నాటికి 82,662 ఇళ్ల (అంచనా కంటే ఎక్కువ)కు సిబ్బంది వెళ్లి, 2,15,796 మంది జనాభా ఉన్నట్టు లెక్కించారు. అలాగే జీవీఎంసీ పరిధిలోని పది జోన్లలో 9,33,710 ఇళ్లలో 24,70,527 మంది జనాభా ఉంటారని అంచనా వేయగా, శనివారం నాటికి 9,24,699 ఇళ్లలో 24,06,114 మంది జనాభా ఉన్నట్టు లెక్కించారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు గడువు పొడిగించడంతో జిల్లాలో మిగిలిన ఇళ్లకు సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించనున్నారు.
సామాజిక పింఛన్లు పంపిణీ రేపు
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో సామాజిక పింఛన్లు ఒకటో తేదీ...సోమవారం పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,57,624 మందికి రూ.69.93 కోట్లు మంజూరయ్యాయి. నాలుగు గ్రామీణ మండలాల్లోని 26,189 మందికి రూ.11.11 కోట్లు, జీవీఎంసీ పరిధిలో 1,31,435 మందికి రూ.58.82 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 123 మందికి (భర్త చనిపోతే భార్యకు) పింఛన్లు మంజూరైనట్టు డీఆర్‌డీఏ పీడీ బి.లక్ష్మీపతి తెలిపారు.