ఊటనీరే దిక్కు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:36 AM
మండలంలోని ఇంజరి పంచాయతీ ఎర్రబయలు గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. గత్యంతరం లేక ఊటగెడ్డ నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.
ఎర్రబయలు గ్రామంలో తాగునీటి సౌకర్యం కరువు
ఏడాది క్రితం మంచినీటి బోరు మంజూరైనా ఏర్పాటు చేయని అధికారులు
గ్రామ శివారులోని పొలాల్లో కలుషిత జలాలను సేకరించాల్సిన దుస్థితి
అనారోగ్యానికి గురవుతున్నామని గిరిజనుల ఆవేదన
పెదబయలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇంజరి పంచాయతీ ఎర్రబయలు గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. గత్యంతరం లేక ఊటగెడ్డ నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.
ఎర్రబయలు గ్రామంలో 15 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఏడాది క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వినతి పత్రం అందజేశారు. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వం మంచినీటి బోరు మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకు మంచినీటి బోరు ఏర్పాటు చేయకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కాలయాపన చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోని పొలాల మధ్య ఊటనీరు ఊరుతుండడంతో కొంత మేర పైపు వేసుకుని ఆ కలుషిత నీరును పట్టుకుంటున్నారు. బిందెలతో పొలం గట్ల మీదుగా నడుచుకుంటూ అతికష్టం మీద గ్రామానికి చేరుకుంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు వీరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. అయితే వరి సాగు ప్రారంభమైతే ఆ బురద నీరు కూడా దొరకదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో మంచినీటి బోరు ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.