Share News

ప్రాథమిక పాఠశాలలు వెలవెల

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:22 AM

విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించిన ప్రభుత్వం.. పలు ప్రాథమిక పాఠశాలల్లో కనీసస్థాయిలో కూడా విద్యార్థులు లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించడంలేదు. సుమారు నెల రోజులపాటు ఉపాధ్యాయులు గ్రామాల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అశించిన మేర విద్యార్థులు చేరలేదు. నూతన విద్యా విదానంలో భాగంగా చాలా వరకు ప్రాథమిక పాఠశాలలను ఒకటి, రెండు తరగతులకే పరిమితం చేయడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

ప్రాథమిక పాఠశాలలు వెలవెల
బూరుగుపాలెం పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఖాళీగా కూర్చున్న టీచర్‌

మాకవరపాలెం మండలంలో పలు స్కూళ్లలో నలుగురైదుగురే విద్యార్థులు

బూరుగుపాలెం పాఠశాలలో ఒక్కరూ లేని వైనం

ఖాళీగా ఉంటున్న ఎంటీఎస్‌ టీచర్‌

ప్రచారమే తప్ప.. ప్రవేశాలు కల్పించలేని అధికారులు

మాకవరపాలె, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించిన ప్రభుత్వం.. పలు ప్రాథమిక పాఠశాలల్లో కనీసస్థాయిలో కూడా విద్యార్థులు లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించడంలేదు. సుమారు నెల రోజులపాటు ఉపాధ్యాయులు గ్రామాల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అశించిన మేర విద్యార్థులు చేరలేదు. నూతన విద్యా విదానంలో భాగంగా చాలా వరకు ప్రాథమిక పాఠశాలలను ఒకటి, రెండు తరగతులకే పరిమితం చేయడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

మాకవరపాలెం మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో పది మంది కన్నా తక్కువ విద్యార్థులు వున్నారు. బూరుగుపాలెంలో పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేదు. ఇక్కడ ఒక ఉపాధ్యాయురాలు రోజూ పాఠశాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోవాల్సి వస్తున్నది. ఈ పాఠశాలకు భవనం, బెంచీలు, ఫ్యాన్లు వున్నప్పటికీ విద్యార్థులు మాత్రం లేరు. గత ఏడాది ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉండే వారు. అయితే ఐదు నెలలపాటు రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఈ ఏడాది ఆ ఇద్దరు విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత కొన్ని రోజుల వరకు ఇక్కడ టీచర్‌ను నియమించలేదు. దీంతో ఒకటి, రెండు తరగతుల్లో చేరేందుకు పిల్లలు రాలేదు. కొద్ది రోజుల క్రితం అధికారులు ఎంటీఎస్‌ (మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌)పై ఉపాధ్యాయురాలిని నియమించారు. అయినప్పటికీ విద్యార్థులు ఎవరూ చేరలేదు. ఆమె రోజూ పాఠశాలకు వచ్చి ఖాళీగా వుంటున్నారు.

కాగా వెంకయ్యపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, మామిడిపాలెంలో ముగ్గురు, మల్లవరంలో ఇద్దరు, దుంగలవానిపాలెంలో నలుగురు, సుభద్రయ్యపాలెంలో నలుగురు, వెంకటాపురం పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే వున్నారు. ఇంకా బుచ్చన్నపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ముసిడిపాలెంలో నలుగురు, పెద్దిపాలెంలో నలుగురు విద్యార్థులు వుండగా.. కామేశ్వర్‌నగర్‌, చినరాచపల్లి, జడ్‌.గంగవరం, నగరం ప్రాథమిక పాఠశాలల్లో పది మందిలోపే విద్యార్థులు ఉన్నారు. మండల విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ కోరవడడంతో ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jul 08 , 2026 | 12:22 AM