తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
ABN , Publish Date - May 22 , 2026 | 12:08 AM
జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు.
- అధికారులకు కలెక్టర్ నిషాంతి ఆదేశం
పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. అలాగే పాడైన బోర్లు, మోటార్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అధికారులు డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో పర్యటించి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కొయ్యూరు మండలంలో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించిన ఆమె, అక్కడ పరిస్థితులను మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టడం అధికారులు బాధ్యతని, అందుకు నిధుల కొరతలేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, డీఆర్‌వో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వీబీ.నాగేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, సీపీవో ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.