ప్రజా భాగస్వామ్యంతో గంజాయికి అడ్డుకట్ట
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:22 PM
ప్రజా భాగస్వామ్యంతో గంజాయి, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం
గొలుగొండ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా భాగస్వామ్యంతో గంజాయి, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలోని గొలుగొండలో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టితో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో గొలుగొండ, నాతవరం, రోలుగుంట మండలాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఈ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు. పాకలపాడు గ్రామంతో పాటు గంజాయి రవాణా సాగుతున్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పోలీసులు తనిఖీ చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా గంజాయి అక్రమార్కులపై పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కాగా నాతవరం మండలం నుంచి గొలుగొండ మండలంలో సాలికమల్లవరం వరకు తాండవ రిజర్వాయర్ అంచునున్న రోడ్డులో ప్రమాదాలు జరగకుండా సైడ్‌వాల్ నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. తాండవ రిజర్వాయర్‌లో గల మెట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. తాగునీటి వనరుల వద్ద, తాగునీటి భారీ ప్రాజెక్టు వద్ద చెత్త లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. దీనికి సంబంధించి చెక్‌పోస్టులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి వ్యాపారం, రవాణా జరుగుతున్న గ్రామాలను గుర్తించి పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌సిన్హ్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ పి.రామారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహశీల్దార్ కాకర నూకరాజు, స్థానిక టీడీపీ నాయకులు అప్పలనాయుడు, చిటికెల సాంబమూర్తి, కొల్లి సత్తిబాబు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు రాజాన వీరసూర్యచంద్ర, పుల్లేటికుర్తి రమేశ్, రాయపురెడ్డి జమీలు, తదితరులు పాల్గొన్నారు.