Share News

వాటర్‌ మిస్ట్‌తో ప్రమాదాల నివారణ

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:15 AM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని అన్ని జల విద్యుత్‌ కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం త్వరలో వాటర్‌ మిస్ట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

వాటర్‌ మిస్ట్‌తో ప్రమాదాల నివారణ
మాట్లాడుతున్న కేవీ రాజారావు

జల విద్యుత్‌ కేంద్రాల్లో ఏర్పాటుకు చర్యలు

మాచ్‌ఖండ్‌లో అన్ని యూనిట్లు అందుబాటులోకి వచ్చేలా యుద్ధప్రాతిపదికన పనులు

సీలేరు కాంప్లెక్సు జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు

సీలేరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని అన్ని జల విద్యుత్‌ కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం త్వరలో వాటర్‌ మిస్ట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ వలన జరిగిన అగ్నిప్రమాదం వంటి సంఘటనలు సీలేరు కాంప్లెక్సులో పునరావృతం కాకుండా ఉండేందుకు అగ్నిప్రమాదాల నివారణ కోసం శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో అమలు చేస్తున్న వాటర్‌మిస్ట్‌ను ఇక్కడ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై తమ హైడల్‌ డైరెక్టర్‌, టెక్నికల్‌ టీంతో చర్చించామని, దీనికి అనుమతి కూడా ఇచ్చారని తెలిపారు. మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో టెక్నికల్‌గా ఎలక్ర్టికల్‌ విభాగంలో షార్ట్‌ సర్క్యూట్‌ వలన అగ్నిప్రమాదం సంభవించిందని, జల విద్యుత్‌ కేంద్రంలో యూనిట్‌ నంబర్‌ 3, 4 రెండు యూనిట్లు కాలిపోవడంతో పాటు మెయిన్‌ కంట్రోల్‌ రూమ్‌లోని కొన్ని ప్యానల్‌ బోర్డులు చాలా వరకు దెబ్బ తిన్నాయన్నారు. వీటికి అవసరమైన సామగ్రి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్వేషించి ఆ సామగ్రిని దిగుమతి చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో రెండు యూనిట్లను, మరో రెండు నెలల్లో మరో రెండు యూనిట్లను వినియోగంలోకి తీసుకొచ్చేలా విద్యుత్‌ సౌదా అధికారులు, ఆంధ్రా, ఒడిశా ఇంజనీర్లు సంయుక్తంగా కృషి చేస్తున్నారని చెప్పారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని సీలేరు, పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రాల్లో అన్ని యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ డిమాండ్‌ మేరకు రోజుకు 8 మిలియన్‌ యూనిట్లు వరకు విద్యుదుత్పత్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. డొంకరాయి మినీ జలవిద్యుత్‌ కేంద్రంలో యూనిట్‌ క్యాపిటల్‌ ఓవరాలింగ్‌ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయని, వారం రోజుల్లో డొంకరాయి నుంచి కూడా విద్యుదుత్పత్తిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో రెండవ దశలో నిర్మిస్తున్న 5, 6 యూనిట్లు కూడా ఈ సంవత్సరం చివరి నాటికి వినియోగంలోకి వచ్చేలా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో సీలేరు కాంప్లెక్సు జెన్‌కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌) జాకీర్‌ హుస్సేన్‌, పంప్డ్‌ స్టోరేజీ ఎస్‌ఈ సీతారామ్‌, ఈఈలు బాలకృష్ణ, టి.అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:15 AM