Share News

తీరం కోతకు అడ్డుకట్ట

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:55 AM

విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ సముద్ర కోతకు గురవుతున్న 30కి పైగా ప్రాంతాలను సంరక్షించేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నడుం కట్టింది.

తీరం కోతకు అడ్డుకట్ట

  • నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి వీఎంఆర్‌డీఏ ప్రతిపాదనలు

  • సమగ్ర అధ్యయన నివేదిక అందజేత

  • రూ.203 కోట్లు ఖర్చవుతుందని అంచనా

  • నిధుల మంజూరుకు సూత్రప్రాయంగా అంగీకారం

  • వచ్చే సమావేశంలో తుది నిర్ణయం

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ సముద్ర కోతకు గురవుతున్న 30కి పైగా ప్రాంతాలను సంరక్షించేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నడుం కట్టింది. అవకాశం ఉన్నంత మేరకు కేంద్ర నిధులు అధికంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ ఏడాది క్రితం తీరం కోత నివారణకు సమగ్ర ప్రాజెక్టును రూపొందించింది. కేంద్రానికి సమర్పించి నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ) నుంచి సాయం కోరింది. దీనికి రూ.203 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అందులో 90 శాతం కేంద్రం సమకూరిస్తే, మిగిలిన 10 శాతం రాష్ట్రంలోని ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అఽథారిటీ నుంచి తీసుకుంటామని వెల్లడించింది.

తీరం కోత నష్టాలపై నివేదిక

కేంద్రం నుంచి వందల కోట్ల రూపాయలు మంజూరు కావాలంటే దానికి తగిన ఆధారాలు సమర్పించాలి. దీనికోసం వీఎంఆర్‌డీఏ పలు సంస్థలతో కలసి అధ్యయనం చేసింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీతో పాటు స్థానిక మత్స్యకారులతోను కలిసి మాట్లాడింది. విశాఖపట్నంలో 28.81 కి.మీ. పొడవున తీరం కోతకు గురవుతున్నట్టు గుర్తించింది. అదే విధంగా భీమిలి మార్గంలో మరో 46.2 కి.మీ. పొడవున తీరం ఓ మోస్తరుగా కోతకు గురవుతున్నదని తేల్చింది. విశాఖపట్నంలో గత ఐదు దశాబ్దాల్లో 60 వరకు తుఫాన్లు వచ్చాయని, వాటిలో 40 తీవ్రమైన నష్టం కలిగించాయని నివేదించింది. తుఫాన్లకు అలలు తీరాన్ని భారీగా తాకి పెను నష్టం కలిగిస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల విశాఖలో కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142 మ్యూజియం, గోకుల్‌ పార్క్‌, ప్రముఖ హోటళ్లు, బీచ్‌రోడ్డుతో పాటు మత్స్యకారుల ఆస్తులకు నష్టం జరుగుతున్నదని వెల్లడించింది. వీటి వల్ల 30 తీరప్రాంత గ్రామాలు, 60 వేల మంది జనాభా ప్రభావితం అవుతున్నారని నివేదించింది. 30 ప్రాంతాల్లో తీరం కోతకు గురవుతున్నదని పేర్కొంటూ అందులో ఆర్‌కే బీచ్‌ అధికంగా నష్టపోతున్నదని వివరించింది. పెదజాలరిపేట, మంగమారిపేట, భీమిలి...ఆ తరువాత స్థానంలో ఉన్నాయని, మిగిలిన 26 గ్రామాలకు వరదలు వచ్చినప్పుడు నష్టం జరుగుతున్నదని వెల్లడించింది.

ఢిల్లీలో సమావేశంలో చర్చ

వీఎంఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనపై ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సెక్రటరీ, ఎన్‌డీఎంఏ అధికారులు గురువారం సమీక్ష నిర్వహించారు. దీనికి వీఎంఆర్‌డీఏ నుంచి జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, ఎస్‌ఈ భవానీశంకర్‌లు హాజరు కాగా, విశాఖ నుంచి కమిషనర్‌ తేజ్‌భరత్‌, సీఈ వినయకుమార్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. పర్యాటకంగా దేశంలో ప్రజాదరణ పొందుతున్న విశాఖపట్నంలో తీరం కోత నివారణ అవశ్యమని, నిధులు మంజూరు చేయాలని అధికారులు కోరగా హోం శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. వచ్చే సమావేశంలో దీనిపై నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.

Updated Date - Feb 21 , 2026 | 12:55 AM