Share News

పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:48 AM

జిల్లాలో గ్రామ పంచాయతీల తొలి దశ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మొదటి విడతలో పోలింగ్‌ జరగనున్న ఎనిమిది మండలాల్లోని 217 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవుల ఎన్నికలకు ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం మొత్తం 70 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం
కశింకోట మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధం చేసిన నామినేషన్‌ పత్రాలు

ఎనిమిది మండలాల్లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

217 సర్పంచ్‌, 2,156 వార్డు పదవులకు ఎన్నికలకు

మొత్తం ఓటర్లు 4.56,597 మంది

పురుషులు: 2,21,718, మహిళలు: 2,34,867, ఇతరులు 12 మంది

అనకాపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల తొలి దశ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మొదటి విడతలో పోలింగ్‌ జరగనున్న ఎనిమిది మండలాల్లోని 217 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవుల ఎన్నికలకు ఆదివారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం మొత్తం 70 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

జిల్లాలో మొదటి విడతలో అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేట, చోడవరం, రావికమతం, రోలుగుంట, పరవాడ, సబ్బవరం మండలాల్లోని పంచాయతీల్లో ఈ నెల 26వ తేదీన పోలింగ్‌ జరగనున్నది. మొత్తం 217 సర్పంచ్‌ పదవులు, 2,156 వార్డు పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం 2,213 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 4,56,597 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,21,718 మంది పురుషులు, 2,34,867 మంది మహిళలు, 12 మంది ఇతరులు ఉన్నారు.

70 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ

తొలి దశ పోలింగ్‌ జరగనున్న ఎనిమిది మండలాల్లో 70 నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి మండలంలో 11, చోడవరం మండలంలో 11, కశింకోట, బుచ్చయ్యపేట, సబ్బవరం మండలాల్లో తొమ్మిది చొప్పున, రావికమతం మండలంలో 8, రోలుగుంట మండలంలో 7, పరవాడ మండలంలో 6 కేంద్రాలు వున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన, 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరిస్తారు. 20న అప్పీళ్ల పరిష్కారం. 21వ తేదీ అభ్యర్థుల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం మూడు గంటల తరువాత ఏకగ్రీవం అయిన సర్పంచ్‌, వార్డు పదవులతోపాటు ఎన్నికలు జరిగే స్థానాల్లో పోటీలో వున్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.

ఎన్నికల వ్యయంపై ఎస్‌ఈసీ పరిమితులు: కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయం, నామినేషన్‌ దాఖలు సమయంలో చెల్లించాల్సిన డిపాజిట్‌ సొమ్ము వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా వివరాలను విడుదల చేసిందని పేర్కొన్నారు. పది వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో వార్డు అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.60 వేలు, పది వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.లక్షగా నిర్ణయించారు. సర్పంచ్‌ అభ్యర్థులకు పది వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.2.5 లక్షలు, పది వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.4 లక్షల వరకు ఖర్చుచేయవచ్చు. ఇక డిపాజిట్లకు సంబంధించి వార్డు అభ్యర్థులు జనరల్‌ కేటగిరీకి అయితే రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సర్పంచ్‌ అభ్యర్థులు జనరల్‌ కేటగిరీకి రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ నిబంధనలను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ఖర్చుల వివరాలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు.

ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా

అనకాపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలిపై చెరగని సిరా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఈ మేరకు ఎస్‌ఈసీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా వేశారని, ఆ సిరా గుర్తులు ఇంకా చెరిగిపోలేదని చెప్పారు. అదే ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటు వేయాల్సి ఉండడంతో గందరగోళం తలెత్తకుండా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Updated Date - Nov 15 , 2026 | 12:48 AM