ఐఎఫ్‌ఆర్‌కు ముస్తాబు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:48 AM
మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఇంటర్నేషన్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కార్యక్రమాలకు నగరం ముస్తాబవుతోంది.
ఐఎఫ్‌ఆర్‌కు ముస్తాబు
రూ.17.35 కోట్లతో నగర సుందరీకరణ పనులు
రహదారులకు రూ.6.32 కోట్లు
రూ.1.87 కోట్లతో కొత్తగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం
రూ.2.87 కోట్లతో సెంటర్ మీడియన్‌లకు మరమ్మతులు
రూ.2.3 కోట్లతో రోడ్లపై లేన్‌మార్కింగ్, స్టడ్‌లు
కాన్వెంట్ జంక్షన్‌లో వాటర్‌ఫౌంటెయిన్
జ్ఞానాపురం జంక్షన్‌లో కొత్తగా బస్‌బే నిర్మాణం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఇంటర్నేషన్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కార్యక్రమాలకు నగరం ముస్తాబవుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులు ప్రయాణించే మార్గాలతోపాటు ఐఎఫ్‌ఆర్‌కు ప్రధాన వేదిక కానున్న ఆర్కే బీచ్‌రోడ్డును అధికారులు సర్వాంగ సుందరంగా తయారుచేస్తున్నారు. నేవీ అధికారుల సూచనల మేరకు రూ.17.35 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న సుందరీకరణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి.
ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకూ జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబునాయుడుతోపాటు 74 దేశాలకు చెందిన నేవీ ఉన్నతాధికారులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి 274 మంది నేవీ అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. బీచ్‌రోడ్డులో వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు సుమారు రెండు లక్షల మంది వీక్షకులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు కావడంతో వాటిని విజయవంతం చేయడం ద్వారా విశాఖతోపాటు ఏపీ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా కార్యక్రమాలు జరిగే ఆర్కే బీచ్‌రోడ్డుతోపాటు అతిథులు ప్రయాణించే మార్గాలు, బసచేసే హోటళ్ల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని నేవీ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. దీంతో జీవీఎంసీ ఆధ్వర్యంలో సుమారు 17.32 కోట్ల వ్యయంతో 104 అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో కొన్ని పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.
రూ.6.32 కోట్లతో 20 తారురోడ్లు నిర్మాణం
ఐఎఫ్‌ఆర్‌కు వచ్చే అతిథులు ఎయిర్‌పోర్టుతోపాటు ఐఎన్‌ఎస్ డేగా, ఐఎన్‌ఎస్ కళింగ, ఐఎన్‌ఎస్ సర్కార్‌లో దిగి తాము బస చేసే హోటల్ లేదా కార్యక్రమాలు జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి బీచ్‌రోడ్డుకు వచ్చే మార్గాల్లో రూ.6.32 కోట్లతో కొత్తగా బీటీ లేయర్ పనులు పూర్తిచేశారు. మల్కాపురం, జ్ఞానాపురం, కాన్వెంట్ జంక్షన్ వంటి పది ప్రాంతాల్లో రూ.1.87 కోట్లతో కొత్తగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మరో పదిహేడుచోట్ల రూ.2.87 కోట్లతో ఫుట్‌పాత్‌లు, సెంటర్ మీడియన్‌ల రిపేర్లు, మూడుచోట్ల సెంటర్ మీడియన్లపై గ్రిల్స్ ఏర్పాటు, 16 మార్గాల్లో రూ.2.3 కోట్లతో లేన్ మార్కింగ్, రూ.50 లక్షలతో కల్వర్టులు, పార్కుల మరమ్మతు, రూ.74.5 లక్షలతో డెకరేటివ్ లైటింగ్, రూ.28.88 లక్షల వ్యయంతో రెండుచోట్ల ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల ఏర్పాటు, రూ.43.75 లక్షలతో పార్కింగ్ స్థలాల్లో లైటింగ్, రూ.25 లక్షల వ్యయంతో బస్‌బేల నిర్మాణం, కాన్వెంట్ జంక్షన్‌లో వాటర్ ఫౌంటెయిన్ నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. వీటిలో చాలావరకు పూర్తికావడంతో ఆయా మార్గాలు, కూడళ్లు కొత్తశోభను సంతరించుకున్నాయి.
90 శాతం పనులు పూర్తిచేశాం
పీవీవీ సత్యనారాయణరాజు, జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్
ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కోసం దేశ ప్రముఖులతోపాటు ఇతర దేశాల నేవీ అధికారులు, ప్రతినిధులు హాజరవుతుండడంతో కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాల మేరకు రూ.17.35 కోట్లతో 104 పనులను ప్రారంభించాం. వీటిలో చాలావరకు ఇప్పటికే పూర్తవ్వగా మిగిలినవి చివరిదశలో ఉన్నాయి. విశాఖ నగరానికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేలా పనులు చేస్తున్నాం.
సిటీ పరేడ్‌కు నేవీ ఏర్పాట్లు
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):
తూర్పు నౌకాదళం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), మిలాన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన ఆర్‌కే బీచ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి బీచ్‌లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భారత నౌకాదళం సముద్రంలోను, గగనతలంలోను సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంది. ఆ తరువాత కార్నివాల్ ఉంటుంది. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనే దేశాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రదర్శిస్తారు. చివరిగా ఫైర్‌వర్క్స్‌తో ఆకాశంలో కాంతులు విరజిమ్ముతారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి మూడు లక్షలకు పైగా నగర ప్రజలు హాజరవుతారని అంచనా. వారంతా కూర్చునేందుకు బీచ్ రోడ్డులో విగ్రహాలు ఉన్న వైపు ఏర్పాట్లు చేస్తున్నారు.