Share News

విద్యార్థులకు కానుకలు సిద్ధం

ABN , Publish Date - Jun 05 , 2026 | 10:13 PM

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా కానుకలను అధికారులు సిద్ధం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బూట్లు, యూనిఫారాలు, తదితరాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,23,812 మందికి విద్యామిత్రా కిట్లు అందజేయనున్నారు. జిల్లాలో 12 స్టాక్‌ పాయింట్లకు కిట్లు ఇప్పటికే చేరుకోగా.. వాటిని పాఠశాలలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

విద్యార్థులకు కానుకలు సిద్ధం
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు

1,23,812 మందికి విద్యామిత్రా కిట్‌లు

12వ తేదీ నాటికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు

జిల్లాలో 12 స్టాక్‌ పాయింట్‌లు

జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు కూడా..

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

అల్లూరి జిల్లాలోని 2,060 పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులతోపాటు 22 జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులతో కలిపి మొత్తం 1,23,812 మందికి సర్వేపల్లి రాఽధాకృష్ణ విద్యామిత్రా కిట్లు అందించేందుకు అధికారులు సిద్ధం చేశారు. గతంలో పాఠశాలలు పునఃప్రారంభం అయిన కొన్ని రోజుల వరకు విద్యా కానుకలను అరకొరగా అందించే పరిస్థితులుండేవి. కాని ప్రస్తుతం అందుకు భిన్నంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే అంటే జూన్‌ 12 నాటికే విద్యార్థులకు అవసరమైన విద్యామిత్ర కిట్‌లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే విద్యామిత్రా కిట్‌లను జిల్లా కేంద్రాలకు సరఫరా చేయగా.. అక్కడి నుంచి మండల కేంద్రాలకు చేరవేసి, తద్వారా పాఠశాలల్లోని విద్యార్థులకు అందించేలా జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీమొబలైజేషన్‌ ఆఫీసర్‌ జ్ఞానప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగానూ జిల్లా, డివిజన్‌, మండల, పాఠశాల స్థాయిల్లో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్‌లను పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో విద్యా మిత్రా కిట్‌ల పంపిణీలో కాస్తా జాప్యం జరిగే అవకాశాలున్నాయి. ఏపీ సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు గతంలోనే ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసిన సంగతి పాఠకులకు విదితమే. దీంతో ఈఏడాది పాఠశాలలు పునఃప్రారంభమైన కొన్ని రోజుల వరకు విద్యా కిట్‌ల పంపిణీ ప్రక్రియ జరిగే పరిస్థితి ఉందని తెలుస్తున్నది.

గతేడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు కిట్‌లు

గతేడాది నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులందరికీ సర్వేపల్లి రాఽధాకృష్ణ విద్యామిత్రా కిట్‌లను అందిస్తున్నామని సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయకర్త డాక్టర్‌ వీఏ.స్వామినాయుడు తెలిపారు. గతంలో ఒకటి నుంచి టెన్త్‌ విద్యార్థులకు కానుకలు పంపిణీ చేయగా.. మిగిలిన వాటిని మాత్రమే ఇంటర్‌ విద్యార్థులకు పంపిణీ జరిగేది. కాని ప్రస్తుతం వారికి అవసరమైన విద్యామిత్రా కిట్‌ను అందిస్తున్నామన్నారు. వాటిని ప్రతి విద్యార్థికి అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.

జిల్లాలో పంపిణీ చేసే విద్యా కానుకల వివరాలు

-మండలాలు: 11

-విద్యాలయాలు: 2,082

- బాలురు: 60,621

- బాలికలు : 63,191

- బ్యాగులు: 1,23,812

- నోట్‌ బుక్స్‌: 5,06,290

- టెక్స్‌ బుక్స్‌: 5,22,387

- బూట్లు: 1,23,812(జతలు)

- బెల్ట్‌లు : 1,23,812

- డిక్షనరీలు: 20,723

- చొక్కాలు : 60,621 మందికి (ఒక్కోక్కరికి మూడు జతలు)

- నిక్కర్లు/ప్యాంట్‌లు: 60,621 మందికి(ఒక్కోక్కరికి మూడు జతలు)

- చుడీదార్‌లు, గౌన్లు: 63,191 మందికి (ఒక్కోక్కరికి మూడు జతలు)

Updated Date - Jun 05 , 2026 | 10:13 PM