వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:29 PM
జిల్లాలో వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. వేసవి కార్యాచరణపై సోమవారం కలెక్టరేట్‌లో అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్/సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అధికంగా ఉండే ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, వారపు సంతలు, బస్టాండ్లు, పర్యాటక ప్రదేశాల్లో తక్షణమే చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో వడదెబ్బ తగలకుండా చూడాలన్నారు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగాలని, అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పశువులకు నీటి సమస్య లేకుండా నీటి కుంటలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అన్నీ సిద్ధం చేయాలని, ఆస్పత్రుల్లో వడదెబ్బ నివారణకు అవసరమైన మందులు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయట సంచరించవద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు, వేసవి నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్‌ను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, శుభం నొక్వాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ బీవీ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి, డీఈవో రామకృష్ణారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.