స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:51 AM
మునిసిపల్, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లతో పాటు సన్నద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
- అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లతో పాటు సన్నద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులు సమన్వయంతో స్ర్టాంగ్‌రూమ్‌లను పరిశీలించి సక్రమంగా ఉన్నాయో?, లేదో తనిఖీ చేయాలని సూచించారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు రిజర్వేషన్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి అంశంపై స్పష్టతతో వ్యవహరించాలని తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అధికారులు వ్యక్తిగతంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గాలను ఖరారు చేసే సమయంలో రహదారులపై గుంతలు ఉన్నా, రహదారులు ఇరుకుగా ఉండి రాకపోకలకు ఇబ్బందులు ఎదురైనా ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే మరమ్మతులు చేయించి రహదారులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ తుహిన్‌సిన్హా, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.