Share News

జడ్పీ ఎన్నికలకు సన్నాహాలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:19 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా పరిషత్‌ యంత్రాంగం ప్రారంభించింది.

జడ్పీ ఎన్నికలకు సన్నాహాలు

పంచాయతీ ఓటర్ల ఆధారంగానే జాబితాల తయారీ

పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు కూడా...

నేడు ఎంపీసీటీ, జడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితాలు విడుదల

15న పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల

ఉమ్మడి జిల్లాలో 18,89,128 మంది ఓటర్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా పరిషత్‌ యంత్రాంగం ప్రారంభించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధించి వేర్వేరుగా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో జిల్లా పరిషత్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పంచాయతీ ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు మూడు జిల్లాల పంచాయతీ అధికారుల నుంచి ఓటర్ల జాబితాలు సేకరించారు. దీని ప్రకారంమూడు జిల్లాల్లోని 965 గ్రామ పంచాయతీల పరిధిలో 9,581 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే ఓటర్లు 18,89,128 మంది (పురుషులు 9,20,036 మంది, మహిళలు 9,69,052, ఇతరులు 40 మంది) ఉన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 652 ఎంపీటీసీ, 39 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్యనుబట్టి పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండుకన్నా ఎక్కువ ఎంపీటీసీ స్థానాలు వున్నాయి. మధ్యతరహా పంచాయతీల్లో ఒక ఎంపీటీసీ, చిన్న పంచాయతీలు అయితే రెండు, మూడు పంచాయతీలను కలిపి ఒక ఎంపీటీసీ వున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పరిధిలో మొత్తం ఓటర్ల జాబితాలను శుక్రవారం నాటికి సిద్ధం చేస్తారు. ఎంపీటీసీ స్థానాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను 14న గుర్తించనున్నారు. 15న పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. వీటిపై 15, 16 తేదీల్లో అభ్యంతరాలు, అభ్యర్థనలు స్వీకరిస్తారు. 16న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం రూపొందించే తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను 18న కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తీసుకుని 19వ తేదీన విడుదల చేస్తారు.

మండల స్థాయిలో పోలింగ్‌ కేంద్రాల జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణ తదితర ప్రక్రియను ఎంపీడీవోలు చేపట్టాలి. జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఆయా జిల్లా ఎన్నికల అధికారి నిర్వహిస్తారు. పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల సంఖ్య మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల జాబితాను ఆయా ఎంపీడీవోలు, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాలను జడ్పీ సీఈవో ప్రకటిస్తారు.

ఇదిలావుండగా ఈనెల 24వ తేదీతో జడ్పీటీసీ, 25వ తేదీతో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నది. ఆ తరువాత కొత్త జిల్లాల వారీగా జడ్పీలు ఏర్పాటు కానున్నాయి.

Updated Date - Sep 11 , 2026 | 01:19 AM