Share News

జడ్పీ ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:03 AM

స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

జడ్పీ ఎన్నికలకు కసరత్తు

సెప్టెంబరు 23వ తేదీతో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గం గడువు

కొత్తజిల్లాల ప్రాతిపదికగా జడ్పీలు ఏర్పాటు

అందుకు అనుగుణంగానే సిబ్బంది విభజన

వారంలోగా కొత్త జిల్లాలకు సీఈవోల నియామకం

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిషత్‌ను కొత్త జిల్లాల ప్రాతిపదికగా విభజన చేయడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుత జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు వచ్చే నెల 23వ తేదీన ముగియనున్నది. పాలక వర్గాల గడువు ముగిసిన వెంటనే ఏ క్షణంలోనైనా ఎన్నికలకు ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ప్రకటన వెలువడే నాటికే ఏర్పాట్లు పూర్తి చేసి, సిబ్బందిని సన్నద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు.

గ్రామ పంచాయతీల వారీగా ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. డెడికేషన్‌ కమిషన్‌ సిఫారసుల నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన మంగళవారం ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రాతిపదికన పంచాయతీల్లో వార్డు, సర్పంచ్‌ రిజర్వేషన్లు ఖరారుచేస్తారు. పంచాయతీల వారీగా ఆయా సామాజిక వర్గాల ఓటర్ల వివరాల ఆధారంగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు పూర్తిచేయనున్నారు. పంచాయతీల్లో ఓటర్ల ఆధారంగా ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి. చిన్న పంచాయతీలు అయితే రెండింటికి ఒక ఎంపీటీసీ లేదా మధ్యస్తంగా ఉంటే ఒకటి, మేజరు పంచాయతీల్లో రెండు ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటుచేస్తారు. మండలానికి ఒక జడ్పీటీసీ ఉంటారు.

ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికల కోసం 2021లో 2,077 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన భవనాలు పటిష్టంగా ఉన్నాయా?, లేదా?...అనే సర్వే చేస్తున్నారు. కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఎక్కడైనా అవసరమా అనే అంశం కూడా పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల బ్యాలెట్‌బాక్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తుండగా, ప్రస్తుతం 3,600 బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఒక్కటే బాక్సు ఉంటుంది. తెల్లని బ్యాలెట్‌ పేపరుపై జడ్పీటీసీ, పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపరుపై ఎంపీటీసీ ఎన్నికలు 2021లో నిర్వహించారు. అయితే పంచాయతీ, ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు వేర్వేరు తేదీల్లో జరగనున్నందున బ్యాలెట్‌ బాక్సులకు పెద్దగా కొరత ఉండదని అంటున్నారు. అదనంగా 500 బాక్సులు అవసరమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ద్వారా పొరుగు రాష్ట్రాలకు లేఖ రాయనున్నారు.

ఇదిలావుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తారు. మండలాల ప్రాతిపదికగా ప్రస్తుత జడ్పీలో ఉన్న సిబ్బందిని విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కేటాయించనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి సిబ్బంది విభజనకు అవసరమైన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ఈ వారంలో కొత్త జిల్లాపరిషత్‌లకు సీఈవో, డిప్యూటీ సీఈవోల నియామకం పూర్తి చేయనున్నారు.

విశాఖ జిల్లాలో నాలుగు మండలాలకు ఒక జడ్పీ అవసరమా అనే మీమాంసను పక్కనపెట్టిన ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జడ్పీలను 28 జిల్లాపరిషత్‌లుగా ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లాలో నాలుగు మండలాలతో జడ్పీ ఏర్పాటు కానున్నది. కాగా గ్రామీణ ప్రాంతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్నందున ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల కోసం ప్రధాన పార్టీల్లో ఆశావహులు తెరపైకి రానున్నారు.


బీసీలకు 26 పంచాయతీలు?

విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా, వచ్చే నెల ఏడో తేదీన తుది జాబితా విడుదల చేస్తారు. పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాల కోసం అధికారులు సర్వే చేస్తుండగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశీలిస్తే జిల్లాలో బీసీలకు 26 గ్రామ పంచాయతీలు వస్తాయి. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆ దామాషా ప్రకారం నాలుగు పంచాయతీలు ఎస్టీలకు కేటాయించాలి. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ప్రకారం 11 పంచాయతీలు ఇవ్వాలి. అయితే జిల్లాలో ఎస్టీ జనాభా లేకపోతే వారికి కేటాయించే సీట్లను బీసీలకు ఇస్తారు.

Updated Date - Aug 19 , 2026 | 01:03 AM