జడ్పీ చైర్మన్ ఎన్నికకు సన్నాహాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:55 PM
విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
నలుగురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు
ఎంపీపీల ఎన్నికల నిర్వహణకూ చర్యలు
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి)
విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈనెల20న చైర్మన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. దీని ప్రకారం కొత్తగా ఎన్నికైన నలుగురు జడ్పీటీసీ సభ్యులు ఎన్ని శ్రీనివాసరావు (ఆనందపురం), గాడు అలివేణి (భీమిలి), కోరాడ సత్యవతి (పద్మనాభం), సుఖవాసి అజయ్ (పెందుర్తి)కి శనివారం నోటీసు జారీచేశారు. ఈనెల 20 న జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నందున హాజరుకావాలని పేర్కొన్నారు. అంతకంటే ముందు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకు 20వతేదీ ఉదయం పదిగంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తిచేస్తారు. ఎన్నికలకు హాజరుకావాలని విశాఖపట్నం, అనకాపల్లిలోక్‌సభ సభ్యులు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబులకు నోటీసులు అందజేశారు. ఈ మేరకు ఏర్పాట్లుచేస్తున్నామని జడ్పీసీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. నాలుగు మండలాల్లో ఒకచోట ఓటు కలిగి ఉండే మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు కో ఆప్షన్‌సభ్యులకు అర్హులన్నీరు.
కాగా ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలకు ఆయా మండలాల ప్రిసైడింగ్ అధికారులు ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు అందచేశారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారులుగా ఆర్.పూర్ణిమాదేవి (ఆనందపురం), బి.రమేష్‌నాయుడు (భీమిలి), బెందాళం లక్ష్మీపతి (పద్మనాభం), ఉషారాణి (పెందుర్తి)ని నియమించారు. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో తొలుత ఒక్కో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక పూర్తిచేస్తామని సీఈవో తెలిపారు. ఇదిలా ఉండగా జడ్పీ, ఎంపీపీ పదవుల ఎంపికకు తెలుగుదేశం నుంచి విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు చోడేవెంకట పట్టాభికి అధిష్ఠానం అధికారం అప్పగించింది. దీంతో ఫారం- ఎను కలెక్టర్‌కు పట్టాభి అందించనున్నారు.