Share News

రెండో విడత పల్లె పోరుకు సన్నద్ధం

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:36 PM

జిల్లాలో పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలను ఈనెల 29న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

రెండో విడత పల్లె పోరుకు సన్నద్ధం
అనంతగిరి పంచాయతీ కార్యాలయం

రేపు పెదబయలు, ముంచంగిపుట్టు,

అనంతగిరి, జి.మాడుగులలో పోలింగ్‌

సర్పంచ్‌ పదవులకు 452 మంది,

వార్డులకు 1,202 మంది పోటీ

మొత్తం 880 వార్డులకు 350 ఏకగ్రీవం కాగా

530 వార్డులకే ఎన్నికలు

నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ,

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది తరలింపు

పాడేరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలను ఈనెల 29న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్‌ బాక్స్‌లు, ఇతర సామగ్రిని అందించి పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో శనివారం ఆయా మండలాల్లో హడావిడి నెలకొంటుంది. ఈ నాలుగు మండలాల్లోని 87 పంచాయతీల్లో సర్పంచులకు 452 మంది, 530 వార్డు స్థానాలకు 1,202 మంది మొత్తం 1,654 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నాలుగు మండలాల్లోని 87 పంచాయతీల్లో సర్పంచులకు 690, 880 వార్డులకు 1,552 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఉపసంహరణ ప్రక్రియ అనంతరం మొత్తం 87 పంచాయతీలకు 238 మంది ఉపసంహరించుకోగా 452 మంది పోటీలో ఉన్నారు. అలాగే మొత్తం 880 వార్డుల్లో 1,552 నామినేషన్లకు 330 తిరస్కరణ/ఉపసంహరణ కాగా 530 వార్డులకు 1,202 బరిలో ఉన్నట్టు డీపీవో కేపీ.చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ తెలిపారు. ముంచంగిపుట్టులో 38,895 మంది, పెదబయలులో 43,322, అనంతగిరిలో 38,286, జి.మాడుగులలో 44,674 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:36 PM