Share News

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:21 AM

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు

వచ్చే నెల తొమ్మిదిన తుది జాబితాల ప్రదర్శన

అనంతరం రిజర్వేషన్‌ల ఖరారు

జిల్లాలో 79 పంచాయతీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్‌ రెండో తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ (ఎన్నికల అథారిటీ), జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించింది.

గ్రామ పంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసే ప్రక్రియను మొదలెట్టాలన్న ఆదేశాలలో అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. భీమిలి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రచురించిన ఓటర్ల జాబితాలను జిల్లా పంచాయతీ అధికారికి అందజేయనున్నారు. భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో మూడు మండలాలు ఉండగా, పెందుర్తి పరిధిలో పెందుర్తి గ్రామీణ మండలం మాత్రమే విశాఖ జిల్లా పరిధిలో ఉంది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,66,561 మంది, పెందుర్తి నియోజకవర్గంలో 3,11,280 మంది ఓటర్లు ఉన్నారు. అందులో గ్రామ పంచాయతీల పరిధిలోకి వచ్చే ఓటర్లను వేరు చేయనున్నారు. అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారుల వద్ద ఉండే జాబితాల్లో పంచాయతీల వారీగా కాకుండా బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు ఉంటాయి. దీని నుంచి పంచాయతీ పరిధిలోని ఓటర్లను వేరు చేసి కార్యదర్శులకు అందజేస్తారు. కులం, పురుషులు, మహిళల వివరాలు నమోదుచేస్తారు. ఈ వివరాలకు అనుగుణంగానే వార్డుల నుంచి పంచాయతీల వరకూ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను వచ్చే నెల తొమ్మిదో తేదీన ప్రదర్శిస్తారు. ఆ తరువాత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లుచేసుకునే అవకాశం ఉంది. తాజాగా ఓటర్ల జాబితాల తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది.

Updated Date - Feb 08 , 2026 | 01:21 AM