స్థానిక సమరానికి కసరత్తు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:50 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు వైసీపీ ముఖ్య నేతలు కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
- రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో వేడెక్కిన రాజకీయం
- జిల్లాలో ప్రధాన పార్టీల వ్యూహాలు
- బలమైన అభ్యర్థుల ఎంపికపై దృష్టి
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు వైసీపీ ముఖ్య నేతలు కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
అభ్యర్థుల ఎంపిక, నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహాలపై పార్టీల ప్రధాన కార్యాలయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో జీవీఎంసీ అనకాపల్లి పరిధిలోని 6 వార్డులతో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీల్లో తమ జెండా ఎగురవేసేందుకు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 24 మండలాల్లో జడ్పీటీసీ స్థానాలు, 661 ఎంపీటీసీ స్థానాలు, 642 గ్రామ పంచాయతీలు, 6,256 వార్డుల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ప్రదాన పార్టీల అధినేతలు, జిల్లా ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందే బలమైన అభ్యర్థులను ఖరారు చేయడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.
కూటమి నేతల సమాలోచనలు
కూటమి పార్టీల ముఖ్య నేతలు స్థానిక పోరులో సత్తా చాటేందుకు సమాలోచనలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక నేతల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా సమన్వయం చేసుకోవడంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావులు పలు పర్యాయాలు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయ సాధనకు చర్చలు జరుపుతున్నారు. మరో వైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఇతర ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేస్తూ, గెలుపొందే అవకాశం ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. రిజర్వేషన్లు ఖరారు అయిన వెంటనే అన్ని పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి.