స్థానిక సమరానికి సన్నాహాలు?
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:11 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ సిఫారసులు
జీవీఎంసీలో 38 వార్డులు...98 వార్డులను ప్రామాణికంగా తీసుకుని 38.78 శాతం కేటాయించాలని సూచన
ఉమ్మడి జిల్లాలో ఆరు జడ్పీటీసీ, 183 ఎంపీటీసీ స్థానాలు
విశాఖ జిల్లాలో 31 గ్రామ పంచాయతీలు, 316 వార్డులు
విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి, డెడికేషన్ కమిషన్‌ను నియమించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై తాజాగా కమిషన్ సిఫారసులు చేసింది. గత ప్రభుత్వ హయాం (2021)లో స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో కేటాయించిన స్థానాల వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.
తాజాగా చేసిన సిఫారసుల ప్రకారం జీవీఎంసీలోని 98 వార్డుల్లో 38 (38.78 శాతం) బీసీలకు కేటాయించాలని సూచించింది. 2021లో జరిగిన ఎన్నికల్లో జీవీఎంసీ పరిధిలో 97 వార్డుల్లో బీసీలకు 32 వార్డులు (32.99 శాతం) కేటాయించారు. అంటే 2021 కంటే ఇప్పుడు ఆరు వార్డులు బీసీలకు ఎక్కువగా రానున్నాయి. అయితే జీవీఎంసీలో వార్డుల సంఖ్యను 120కు పెంచాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం...ఆ మేరకు ప్రక్రియ ప్రారంభించింది. అయితే డెడికేషన్ కమిషన్ మాత్రం 2021 లెక్కలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు సీట్ల కేటాయింపుపై సిఫారసులు చేసింది.
జిల్లా పరిషత్‌ల విభజన ఇంకా జరగకపోవడంతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు ఇవ్వాల్సిన సీట్లను కమిషన్ గుర్తించింది. దీని ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాలకుగాను ఆరు (15.38 శాతం), 649 ఎంసీటీసీ స్థానాల్లో 183 (28.2 శాతం) బీసీలకు కేటాయించాలని సిఫారసు చేసింది. 2021లో 39 జడ్పీటీసీ స్థానాల్లో తొమ్మిది (23.08 శాతం), ఎంపీటీసీ స్థానాల్లో 176 (26.99 శాతం) బీసీలకు కేటాయించారు. ఇక జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో 31 (39.24 శాతం), 813 వార్డుల్లో 316 (36.38 శాతం) బీసీలకు కేటాయించాలని సూచించారు. 2021లో విశాఖ జిల్లాలో 33 గ్రామ పంచాయతీల్లో బీసీలకు (41.77 శాతం) కేటాయించారు. కాగా ఈ ఏడాది మార్చి నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం వచ్చే నెల మూడో వారంతో ముగియనున్నది. జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం కూడా ఈ ఏడాది మార్చిలో ముగిసింది.