పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:51 AM
నగరంలో ఈనెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాట్లు మొదలయ్యాయి.
ఈ నెల 12, 13 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహణ
తొలిరోజు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మలిరోజు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ రాక
11న నగరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ సమీక్ష
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ఈనెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వరుసగా రెండో ఏడాది నిర్వహించనున్న సదస్సుకు వందకుపైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. సదస్సు ప్రారంభం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 11వ తేదీన నగరానికి రానున్నారు.
పెట్టుబడుల సదస్సు నిర్వహణ ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌తో కలిసి ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సదస్సు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి రానున్న ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటుచేయాలని సూచించారు. లైజన్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలు, అతిథుల అవసరాలు, కార్యక్రమాల వివరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విదేశీ అతిథులు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నందున గైడ్లను సిద్ధం చేసుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో స్వాగత బోర్డులు, సూచికలు ఏర్పాటుచేయాలని, నగరమంతా సమ్మిట్ బ్రాండింగ్, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు.
జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సివిల్, పారిశుధ్య, నగర సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని రావత్ ఆదేశించారు. ఇతర భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావ్వికుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, తెలుగు సంప్రదాయంలో అతిథులకు స్వాగతం పలకాలని, వసతి, రవాణా, గాలా డిన్నర్ పక్కాగా ఉండాలన్నారు. సదస్సు జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి ఎదురుగా ఉన్న మైదానంలో డెలిగేట్లకు రిజిస్ట్రేషన్, పాస్‌లు జారీ, పార్కింగ్ ఏర్పాట్లకు ంంబంధించి ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు.
కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ సదస్సు కోసం ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కంట్రోల్‌రూమ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పాస్‌ల జారీని కలెక్టరేట్ నుంచి పర్యవేక్షిస్తామని, ఇందుకు అధికారులు కంట్రోల్‌రూమ్‌లో అందుబాటులో ఉండాలన్నారు. సమీక్షలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రాతబాగ్చి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఏపీఈడీబీ సీఈవో మన్మోహన్, ఏపీఐఐసీ, జీసీసీ ఎండీలు దినేష్‌కుమార్, శోభిక, సెర్ఫ్ సీఈవో కరుణ, జేసీ జి.విద్యాధరి, ఇతర ఉన్నతాధికారులు గీతాంజలి శర్మ, గెడ్డం శేఖరబాబు, డీసీపీ మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.