హోలీ జాతరకు ముస్తాబు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:29 PM
మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్‌లో గల రాధాకృష్ణుల ఆలయం హోలీ జాతరకు ముస్తాబయింది.
తాజంగి బీటాలైన్‌లో ఏర్పాట్లు
70 అడుగుల కర్రల పోగు దహనం రేపు
నేటి నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు
భారీ సంఖ్యలో తరలిరానున్న భక్తులు
చింతపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్‌లో గల రాధాకృష్ణుల ఆలయం హోలీ జాతరకు ముస్తాబయింది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హోలీని పురస్కరించుకుని సంప్రదాయంగా భక్తులు ఆలయం ఎదుట 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన కర్రల పోగును మంగళవారం కాలుస్తారు. ఆ వేడుకలో స్వయంగా పాల్గొనేందుకు పలు గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తాజంగి పంచాయతీ బీటాలైన్‌లో ఒడిశా నుంచి వలస వచ్చిన 300 కుటుంబాల ఆదివాసీలు సుమారు 85 ఏళ్లుగా నివాసముంటున్నారు. స్థానిక గిరిజనులు గ్రామంలో రాధాకృష్ణుల ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏటా హోలీ రోజున పండుగ జరుపుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం ఆలయాన్ని ఆధునికీకరించారు. అయితే బీటాలైన్ ఆదివాసీలు విభిన్నంగా జరుపుకునే హోలీ వేడుక పూర్వం నుంచి కొనసాగుతున్నది. ఈ ఏడాది హోలీ వేడుకలకు రాధాకృష్ణుల ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం రాత్రి భక్తుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మంగళవారం హోలీ సంబరం
మంగళవారం వేకువజామున నాలుగు గంటలకు హోలీ సంబరం నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కర్రల పోగును కాల్చే వేడుకను నిర్వహిస్తారు. ఇప్పటికే స్థానిక భక్తులు 70 అడుగుల కర్రల పోగును సిద్ధం చేశారు. ఈ కర్రల పోగును మంగళవారం ఉదయం ఐదు గంటలకు కాలుస్తారు. ఈ కర్రల పోగుపైన ఒక జెండాను తాడుతో ఎగురవేస్తారు. ఈ జెండాను పట్టుకోవడానికి కర్రల పోగు చుట్టూ యువ భక్తులు నిరీక్షిస్తుంటారు. కర్రల పోగు కాలిపోయి జెండా గాలిలోకి ఎగురుతుంది. ఈ జెండాను పట్టుకున్న వ్యక్తిని భక్తులందరూ ఎత్తుకుని అతని గృహం వరకూ గిరిజన సంప్రదాయ నృత్య కళాప్రదర్శనలతో తీసుకొస్తారు. జెండాను పట్టుకున్న వ్యక్తికి ఆలయ కమిటీ నగదు బహుమతిగా రూ.1,116 అందజేయనున్నట్టు కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ జెండాను పట్టుకున్న కుటుంబానికి ఏడాదంతా శుభం జరుగుతుందని స్థానిక భక్తుల నమ్మకం. ఈ ప్రాంత గిరిజనులందరూ ఈ జెండా పట్టుకున్న వ్యక్తితోనే రానున్న ఖరీఫ్ సాగులో తొలి విత్తనాల నాట్లు వేయిస్తారు. జెండా పట్టుకున్న వ్యక్తితో నాట్లు వేయిస్తే అధిక దిగుబడులు వస్తాయనేది ఆదివాసీల విశ్వాసం.
గిరజనుల్లో చైతన్యం పెరగడంతో పాత ఆచారానికి స్వస్తి
బీటాలైన్‌లో ప్రతి ఏటా జరిగే హోలీకి మరో ప్రత్యేక వుంది. సుమారు 20 ఏళ్ల క్రితం హోలీ పండుగ సమయంలో ఇష్టమైన అమ్మాయి చేయిపట్టుకుని గృహానికి తీసుకు వెళితే వారిద్దరికీ వివాహమైనట్టుగా గిరిజనులు భావించేవారు. ప్రతి ఏటా ఈ హోలీ పండుగ సమయంలో సుమారు 20-30 జంటలు చేయి పట్టుకునే పద్ధతిలో కలిసేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళా చట్టాలపై ప్రజల్లో చైతన్యం పెరగడం, చట్టాలను మరింత కఠినతరం చేయడంతో ఈ చేయిపట్టుకుని తీసుకు వెళ్లే ఆచారానికి స్థానిక గిరిజన యువత పూర్తిగా స్వస్తి పలికింది.