పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:56 AM
జిల్లాలోని నాలుగు మండలాల్లో గల 79 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల
19న నోటిఫికేషన్, 2న పోలింగ్
రెండు నుంచి నాలుగు పంచాయతీలకు ఒకచోట నామినేషన్లు స్వీకరణ
బ్యాలెట్‌లో పేర్లు కాకుండా గుర్తులు
జిల్లాలో 79 పంచాయతీలు, 802 వార్డులు
ఓటర్లు 1,62,407
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని నాలుగు మండలాల్లో గల 79 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న నోటిఫికేషన్ విడుదలచేస్తారు. డిసెంబరు రెండో తేదీన పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తొలిదశలో నియమితులైన అధికారులు కేవలం నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో దశలో నియమితులైన అధికారులు పోలింగ్ నిర్వహించి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన పూర్తిచేస్తారు.
రెండు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలకు కలిపి ఒకచోట (పది వేల ఓటర్లుకు మించకూడదు) నామినేషన్లు తీసుకుంటారు. అంతే తప్ప పంచాయతీల వారీగా నామినేషన్లు స్వీకరించరు. ఆనందపురం మండలంలో ఏడుచోట్ల, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో ఆరేసి కేంద్రాల్లో, భీమిలి మండలంలో నాలుగుచోట్ల నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులతో తుది జాబితా ప్రకటించడం వరకూ మొదటి దశలో బాధ్యతలు చేపట్టిన అధికారులు చూస్తారు. రెండో దశలో పోలింగ్ నిర్వహణకు ప్రతి పంచాయతీకి ఒక అధికారిని ఆర్వోగా నియమిస్తారు. పంచాయతీ పరిధిలో వార్డుల సంఖ్య మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. జిల్లాలో 79 పంచాయతీల పరిధిలో 802 వార్డులు ఉండగా 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ అధికారి, ఒక సహాయకుడు ఉంటారు. ఒకవేళ వార్డులో ఓటర్ల సంఖ్య 200 దాటితే ఇద్దరు సహాయకులను కేటాయించనున్నారు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లు కాకుండా వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు...ఒకటి సర్పంచ్‌కు, మరొకటి వార్డు సభ్యుడికి వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభించారు. సర్పంచ్‌కు పింక్ రంగు, వార్డు సభ్యుడికి తెల్ల రంగు బ్యాలెట్లు ఉంటాయి. మొత్తం 79 పంచాయతీల పరిధిలో 1,62,407 మంది ఓటర్లు ఉన్నారు.
డేటా సెంటర్, ఐటీ పార్క్...
అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఏర్పాటుచేస్తాం
ప్రభుత్వానికి ‘పంచశీల్’ రియాల్టీ ప్రతిపాదన
విశాఖపట్నం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరో డేటా సెంటర్ రానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పంచశీల్ రియాల్టీ సంస్థ చైర్మన్ అతుల్ చోర్డియా సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. తమకు తగిన భూములు కేటాయిస్తే డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్క్ నిర్మిస్తామని ప్రతిపాదించారు. అనకాపల్లిలో హైపర్ స్కేల్ డేటా సెంటర్, విశాఖపట్నంలో ఐటీ పార్క్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విశాఖలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్ కూడా నిర్మిస్తామని ప్రణాళిక సమర్పించారు. వీటికి రూ.49,311 కోట్ల పెట్టుబడి పెడతామని, 29,600 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. ఈ మేరకు ప్రణాళికను సీఎంకు సమర్పించారు.