పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం!
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:27 AM
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ప్రత్యేక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సంకేతాలిచ్చింది. ఈ నెల 2వ తేదీతో పంచాయతీ యాజమాన్యాల ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో పంచాయతీలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.
ఈ నెల 2తో ముగిసిన సర్పంచుల పదవీకాలం
ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు
15న పంచాయతీల్లో ఓటరు జాబితాను ప్రదర్శించాలని ఈసీ ఆదేశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ప్రత్యేక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సంకేతాలిచ్చింది. ఈ నెల 2వ తేదీతో పంచాయతీ యాజమాన్యాల ఐదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో పంచాయతీలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారింది. దీంతో ఈ నెల 15న ప్రతి పంచాయతీ కేంద్రంలో ఓటరు జాబితాల ప్రదర్శన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలెక్టర్, జిల్లా పంచాయతీ, డివిజనల్ పంచాయతీ అధికారులకు సూచించింది.
ఇప్పటికే ఎన్నిలకు సంబంధించిన ఓటరు జాబితాలు, జోన్లు, రూట్లు, తదితర అంశాలపై అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడమే తరువాయి అన్నట్టు అటు యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు సైతం సిద్ధంగా ఉన్నాయి. గత పంచాయతీ ఎన్నికలు 2021 ఫిబ్రవరి నెలలో నాలుగు విడతల్లో నిర్వహించారు. అయితే ఈ దఫా ఎన్ని విడతల్లో నిర్వహిస్తారనేది ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితేనే స్పష్టత వస్తుంది. గతంలో వలే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జిల్లాలో 244 పంచాయతీలు.. 2,446 వార్డులు
జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు.. మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులున్నాయి. అలాగే పురుష ఓటర్లు 2,41,192 మంది, మహిళలు 2,56,732 మంది, ఇతరులు 23 మంది కలిపి మొత్తం 4,97,947 మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఎన్నికల సమయానికి వాటి సంఖ్య కాస్త పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. అలాగే మొత్తం 244 గ్రామ పంచాయతీలను 69 జోన్లు, 105 రూట్‌లుగా విభజించారు. తదుపరి ఎన్నికల కమిషన్ ఆదేశాలు, సూచనలతో పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అంశాల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.
గ్రామాల్లో జోరుగా రాజకీయ సమీకరణలు
ప్రస్తుతం సర్పంచుల పదవీకాలం ముగియడం, పంచాయతీలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లడం, ఇదే క్రమంలో ఓటరు జాబితాల ప్రదర్శనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో రాజకీయ పార్టీల్లోనూ ఉత్సాహం మొదలైంది. దీంతో పంచాయతీల వారీగా తమ బలాలను పార్టీలు బేరీజు వేసుకుంటూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో ఎవర్ని సర్పంచుగా, వార్డు సభ్యులుగా బరిలోకి దింపాలనే లెక్కల్లో రాజకీయ నేతలు మునిగి తేలుతున్నారు. దీంతో గ్రామాల్లో ఒక మోస్తరుగా రాజకీయ వేడి రాజుకుంటున్నది.