Share News

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:17 PM

గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్‌ రెండో తేదీ వరకు పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియనుంది.

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
పాడేరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో గత ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు (ఫైల్‌)

ఏప్రిల్‌తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

మార్చి 9న పంచాయతీల్లో

ఓటరు జాబితాను ప్రదర్శించాలని ఈసీ ఆదేశం

అప్రమత్తమైన అధికారులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్‌ రెండో తేదీ వరకు పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. ఈ ఏడాది మార్చి 9న పంచాయతీల్లో ఓటరు జాబితాల ప్రదర్శన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ ఆదేశాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలు, జోన్లు, రూట్లు, తదితర అంశాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎన్నికలకు అటు యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు సైతం సిద్ధంగా ఉన్నాయి. గత పంచాయతీ ఎన్నికలు 2021 ఫిబ్రవరి నెలలో నాలుగు విడతల్లో నిర్వహించారు. అయితే ఈ దఫా ఎన్ని విడతల్లో నిర్వహిస్తారనేది ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయితేనే స్పష్టత వస్తుంది. అయితే గతంలో వలే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జిల్లాలో 244 పంచాయతీలు 2,446 వార్డులు

జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులున్నాయి. అలాగే పురుషులు 2,19,896 మంది, మహిళలు 2,30,147 మంది, ఇతరులు 18 మంది మొత్తం 4,50, 061 మంది ఓటర్లున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల సమయానికి వాటి సంఖ్య కాస్త పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. అలాగే మొత్తం 244 గ్రామ పంచాయతీలను 69 జోన్లు, 105 రూట్‌లుగా విభజించారు. తదుపరి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలతో పోలింగ్‌ కేంద్రాలు మినహా మిగిలిన అంశాల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:17 PM