మోదకొండమ్మ ఉత్సవాలకు ముస్తాబు
ABN , Publish Date - May 08 , 2026 | 12:36 AM
స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పాడేరు ముస్తాబవుతోంది. అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీల సమన్వయంతో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
17 నుంచి 19 వరకు వేడుకలు
అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీల సమన్వయంతో చురుగ్గా ఏర్పాట్లు
ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న కోల్‌కతా విద్యుత్ అలంకరణ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పాడేరు ముస్తాబవుతోంది. అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీల సమన్వయంతో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి 19 ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ నెల 12న మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుక ఉండడంతో ఆ రోజు నుంచే పాడేరులో ఉత్సవాల హడావిడి మొదలు కానుంది. దీంతో 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాల సందడి నెలకొంటుందని ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేస్తుండగా, మూలవిరాట్ ఆలంకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో మూడు రోజుల్లో మొత్తం కొత్త రంగుల అలంకరణ పనులు పూర్తి కానున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న విద్యుత్ అలంకరణ
ఈ ఏడాది ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కోల్‌కతా నుంచి ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ చేసేందుకు ఒప్పందం కుర్చుకున్నారు. గతంలో భూరెడ్డి నాగేశ్వరరావు ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2019లో ఉత్సవాల్లో కోల్‌కతా లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సుమారుగా ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది అదే లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రధాన కూడళ్లలో సైతం పెద్ద విద్యుత్ సెట్టింగ్ కటౌట్‌లతో పాటు వీధుల్లో సైతం లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో ఎటు చూసినా లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే ఉత్సవాలు 17 నుంచి అయినప్పటికీ, మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుక ఈ నెల 12న కావడంతో ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే విద్యుత్ అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాలు భక్తులను ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ప్రధాన కార్యదర్శులు డీపీ.సురేశ్‌కుమార్, భూరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర వైద్య సేవలు అందించడంలో పాటు రాష్ట్రంలోని పలు గిరిజన ప్రాంతాల నుంచి గిరిజన సంప్రదాయం కళాకారులను రప్పించి ప్రదర్శనలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.