గ్రేటర్ ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:19 AM
జీవీఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుది ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఈనెల మూడున జారీచేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
3న వార్డుల పునర్విభజనపై తుది ముసాయిదా నోటిఫికేషన్
120 వార్డుల సరిహద్దులతో ముసాయిదాను
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు పంపిన అధికారులు
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుది ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఈనెల మూడున జారీచేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజన చేయడంతో పాటు ఈ ఏడాది మే నెలలో కొత్త వార్డుల సరిహద్దులతో కూడిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి 2,667 అభ్యంతరాలు అందాయి. వాటిలో దాదాపు 2,500 జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 150కి పెంచాలని కోరుతూ వచ్చాయి. మిగిలినవాటిల్లో కాలనీలు, వీధులను మరొక వార్డులోకి చేర్చాలని, సరిహద్దులు మార్చాలని, వార్డు మధ్య నుంచి గెడ్డలు, జాతీయ రహదారి వెళుతోందన్న అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయి. వీటిలో కేవలం ఉత్తర జోన్ పరిధిలోని ఒక వార్డు మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతుండడంతో దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు సరిహద్దును మార్చి ముసాయిదాను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు పంపించారు. అక్కడ పరిశీలన పూర్తయిన తర్వాత ఈనెల మూడున కొత్త వార్డుల సరిహద్దులను నిర్ధారిస్తూ వార్డుల పునర్విభజన ముసాయిదా తుది నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా ఆనందపురం మండలంలోని 26 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తూ గ్రామసభల్లో చేసిన తీర్మానాలు లోపభూయిష్టంగా ఉండడంతో ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి వీలీనంపై అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి డైరెక్టర్ (సీడీఎంఏ)ను ప్రభుత్వం ఆదేశించింది.
ఆనందపురం మండలంలో మళ్లీ గ్రామసభలు
మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు
విశాఖపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రతిపాదనపై ఆనందపురం మండలంలో నిర్వహించిన గ్రామ సభలను ఉన్నతాధికారులు రద్దు చేశారు. మరోసారి గ్రామ సభలు నిర్వహించాలని, ఈసారి ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆనందపురం మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 25 నుంచి గ్రామ సభల నిర్వహణకు ఎంపీడీవో 24వ తేదీన ప్రొసీడింగ్స్ జారీచేశారని, నిబంధనల ప్రకారం కనీస సమయం ఇవ్వలేదని రాష్ట్ర మునిసిపల్ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులకు బీసీవై పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. చాలామంది ప్రజలకు గ్రామ సభలపై సమాచారం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో 26 గ్రామ పంచాయతీల్లో మళ్లీ సభలు నిర్వహించాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశించింది. గ్రామ సభలు ఎప్పుడు నిర్వహిస్తారో ఎంపీడీవో త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తారు.