గ్రేటర్ ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:19 AM
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలో నోటిఫికేషన్ జారీచేసినా సరే షెడ్యూల్ ప్రకారం సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. వార్డుల పునర్విభజనపై ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. 120 వార్డులా?, గతంలో మాదిరిగా 98 వార్డులా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు విధాలుగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఏర్పాట్లలో అధికారుల తలమునకలు
వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను క్రోడీకరించి నివేదిక తయారుచేస్తున్న
టౌన్‌ప్లానింగ్ విభాగం
కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏర్పాట్లు
120 వార్డులైనా, గతంలో మాదిరిగా
98 వార్డులతోనైనా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
జనాభా, ఓటర్లు, పోలింగ్ స్టేషన్‌ల గుర్తింపునకు
అధికారులు కార్యాచరణ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఏ క్షణంలో నోటిఫికేషన్ జారీచేసినా సరే షెడ్యూల్ ప్రకారం సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. వార్డుల పునర్విభజనపై ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. 120 వార్డులా?, గతంలో మాదిరిగా 98 వార్డులా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు విధాలుగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలకు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో రిజర్వేషన్ల ఖరారుపై శాసనసభలో బిల్లు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. ముందుగా పట్టణ స్థానిక సంస్థలకు తర్వాత మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు చివరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. మేయర్‌లు, మునిసిపల్ చైర్మన్‌లను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునేలా చట్టసవరణ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబరు చివరి నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలను పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో అందుకు తగ్గట్టుగా జీవీఎంసీ యంత్రాంగం సిద్ధమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు ఇప్పటికే ముసాయిదాను విడుదల చేశారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తిచేశారు. వాటిని క్రోడీకరించి రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులకు అందజేసేందుకు నివేదిక తయారుచేస్తున్న సమయంలో కొందరు హైకోర్టులో పిల్ వేయడంతో వార్డుల పునర్విభజనపై స్టే విధించింది. దీంతో వార్డుల పునర్విభజన ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబరులోగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయడంతో వార్డుల పునర్విభజనపై అందిన అభ్యంతరాలపై సమగ్ర నివేదిక తయారుచేసి కోర్టు స్టే తొలగించిన వెంటనే ఉన్నతాధికారులకు పంపించేలా నివేదికను సిద్ధం చేస్తున్నారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరం లేదని కోర్టు ప్రకటిస్తే 120 వార్డులతో ఎన్నిక నిర్వహించాలని, లేనిపక్షంలో గతంలో ఉన్న 98 వార్డులతోనే ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ భావిస్తున్నారు. అందుకోసం 120 వార్డుల వారీగా జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను, అదే 98 వార్డులే అయితే దాని ప్రకారం జనాభా, ఓటర్లు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను గుర్తించాలని జీవీఎంసీలోని ఎలక్టోరల్, అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
ఎన్నికలపై వరుస సమావేశాలు
ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కార్యదర్శులు గత రెండు రోజులుగా ఉదయం, సాయంత్రం వేళల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అధికారులు నివేదికలతో సమావేశాలకు హాజరవుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల గురించి కమిషనర్ కేతన్‌గార్గ్ వద్ద ప్రస్తావించగా, ఏ క్షణంలో ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.