కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:36 AM
పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం జీఓ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికే పునర్విభజన చేసిన వార్డుల వివరాలతో షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ జాబితాను అంటే ఏయే ప్రాంతాలు ఏయే వార్డుల్లో ఉంటాయో, కొత్తగా ఏర్పాటైన వార్డులు ఏమిటో వివరిస్తూ శనివారం నుంచే కార్పొరేషన్ నోటీసు బోర్డులో పెట్టాలని, అలాగే సంబంధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని సూచించింది. ఈ పునర్విభజనపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా, సలహాలు, సూచనలు చేయాలనుకున్నా వారం రోజుల పాటు స్వీకరించాలని సూచించింది.
ప్రజలకు అందుబాటులో
వార్డుల పునర్విభజన వివరాలు
నేటి నుంచి వారం రోజులపాటు
అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం
14న తుది జాబితా వెల్లడి
జీవీఎంసీలో వార్డులు 98 నుంచి 120కు పెంపు
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం జీఓ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పటికే పునర్విభజన చేసిన వార్డుల వివరాలతో షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ జాబితాను అంటే ఏయే ప్రాంతాలు ఏయే వార్డుల్లో ఉంటాయో, కొత్తగా ఏర్పాటైన వార్డులు ఏమిటో వివరిస్తూ శనివారం నుంచే కార్పొరేషన్ నోటీసు బోర్డులో పెట్టాలని, అలాగే సంబంధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని సూచించింది. ఈ పునర్విభజనపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా, సలహాలు, సూచనలు చేయాలనుకున్నా వారం రోజుల పాటు స్వీకరించాలని సూచించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలు తెలియజేయడానికి ప్రజలకు గడువు ఇచ్చింది. 12వ తేదీన పునర్విభజన చేసిన వార్డులు, వాటిపై వచ్చిన అభ్యంతరాలు, సలహాలను పురపాలన, పట్టణాభివృద్ధి శాఖకు పంపించాల్సి ఉంటుంది. అక్కడ 13వ తేదీన వాటిని పరిశీలించి ఖరారు చేస్తారు. ఆ మరుసటిరోజు 14వ తేదీన ఎన్ని వార్డులను ఖరారు చేసిందీ తుది జాబితా విడుదల చేస్తారు. దాని ప్రకారమే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే జీవీఎంసీలో 98 వార్డులు కాకుండా అదనంగా పెరిగిన మరో 22 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 120 మంది కార్పొరేటర్లు ఉంటారు. మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అది కూడా కీలక అంశం కానుంది.
ఆ 79 పంచాయతీల ప్రమేయం లేకుండానే
కార్పొరేషన్లు, మునిసిపాలిటీ సరిహద్దులు మార్చకుండా వార్డుల పునర్విభజన జరగాలని జీఓలో స్పష్టంచేయడంతో జీవీఎంసీలో నాలుగు మండలాల (భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి) విలీనం ప్రతిపాదనపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతానికైతే 79 పంచాయతీలను పక్కనపెట్టి షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. ఆ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
జీవీఎంసీ వెబ్‌సైట్‌లో వార్డుల వివరాలు
కమిషనర్ కేతన్ గార్గ్
మమా విశాఖ నగర పాలక సంస్థలో 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజన చేస్తూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు కమిషనర్ కేతన్ గార్గ్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను కూడా సిద్ధం చేశామన్నారు. ఈ జాబితా జీవీఎంసీ వెబ్‌సైట్‌లో ఉందని, అలాగే పది జోనల్ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లోను అందుబాటులో ఉంచామన్నారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా 5వ తేదీ నుంచి 11వ తేదీలోపు సమర్పించాలన్నారు.