పంచాయతీ ఎన్నికలకు ప్రాథమిక ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:03 PM
జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఎన్నికలపై మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ టి.నిషాంతి ఆదేశం
ప్రతి పోలింగ్ కేంద్రాన్ని అధికారులు పరిశీలించాలని సూచన
పాడేరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఎన్నికలపై మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి మండలంలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవోలు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కనీస అవసరాలైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నీచర్ అందుబాటులో ఉండాలన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంప్‌లను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 23న ప్రకటించాలని, వాటిపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించి 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రకటించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల విభజన ప్రక్రియలను పారదర్శకంగా చేపట్టాలన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 25న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాలని, వాటిని గ్రామసభల ద్వారా నిర్ధారించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు అన్ని ప్రక్రియలను పక్కాగా చేపట్టి సెప్టెంబరు 7న కచ్చితంగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల విభజనతో తుది ఓటరు జాబితాలను ప్రకటించాలన్నారు. అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు నిమగ్నం కావాలని, వాటిని పైఅధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాలను అధికారులకు డీఎల్‌పీవో పీఎస్.కుమార్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, జిల్లాలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.