గర్భిణికి తిప్పలు
ABN , Publish Date - May 17 , 2026 | 10:23 PM
రోడ్డు సౌకర్యం లేక పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌లో వెళ్లి ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
రోడ్డు లేక రెండు కిలోమీటర్లు నడక
ఆపై అంబులెన్స్ కోసం నిరీక్షణ
వెదురుగొయ్యి గ్రామస్థుల పాట్లు
గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్
పెదబయలు, మే 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు సౌకర్యం లేక పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణి రెండు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌లో వెళ్లి ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మండలంలోని అనేక గ్రామాలకు పక్కా రోడ్డు సదుపాయం లేక గిరిజనులు అత్యవసర సమయాల్లో నానా పాట్లు పడుతున్నారు. మారుమూల బొంగరం పంచాయతీలోని కొండ శిఖర గ్రామమైన వెదురుగొయ్యికి చెందిన చిక్కుడు సీమాలి అనే నిండు గర్భిణికి ఆదివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆశ కార్యకర్తకు సమాచారం అందించారు. ఆమె అంబులెన్స్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం లేని కారణంగా అంబులెన్స్ చేరుకోలేదని డ్రైవర్ చెప్పాడు. గర్భిణిని వంచుర్భ గ్రామం వద్దకు తీసుకురావాలని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. దీంతో చేసేది లేక వెదురుగొయ్యి గ్రామం నుంచి వంచుర్భ వరకు రెండు కిలోమీటర్లు అతి కష్టంగా నడిపించుకుంటూ గర్భిణిని తీసుకువచ్చారు. గర్భిణి వచ్చేటప్పటికి అంబులెన్స్ రాకపోవడంతో అక్కడ చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఓవైపు పురిటినొప్పులు.. మరోవైపు నడకతో అలసటతో గర్భిణి చాలా ఇబ్బంది పడింది. చివరకు అంబులెన్స్ రావడంతో గోమంగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యుడు పరిశీలించి ఆమెకు రక్తంగా ఉండడంతో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో గర్భిణి సీమాలి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు రక్తం ఎక్కించేందుకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్డు వేయండి బాబూ..
వెదురుగొయ్యి గ్రామంలో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నిత్యజీవితంలో తీవ్ర కష్టాలు పడుతున్నారు. దీంతో గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం కష్టంగా మారింది. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, పండించిన పంటలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెదురుగొయ్యి గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని జీఎస్‌యూ నేత మాధవరావు, గ్రామస్థులు కోరుతున్నారు.