Share News

సాధారణ భక్తులకు ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:30 AM

సింహాచలం చందనోత్సవం నిర్వహణలో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమీక్షించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, చిన్న తప్పిదాలు కూడా జరగడానికి వీల్లేదని, ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు

సాధారణ భక్తులకు ప్రాధాన్యం

సింహాచలం దేవస్థానం అధికారులకు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి

డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశం

అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

గత పొరపాట్లు పునరావృతం కాకూడదు

టికెట్లను కలెక్టర్‌, ఈఓలే జారీ చేయాలన్న ఎమ్మెల్యేలు

విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం చందనోత్సవం నిర్వహణలో గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమీక్షించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, చిన్న తప్పిదాలు కూడా జరగడానికి వీల్లేదని, ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. టికెట్ల జారీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, ఏప్రిల్‌ 17 నాటికే అన్ని పూర్తికావాలని సూచించారు. వాహనాలకు, డ్యూటీ పాస్‌ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మాట్లాడుతూ భక్తులకు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్లకు వేర్వేరు క్యూలైన్లు పెడుతున్నామన్నారు. ఏప్రిల్‌ 20వ తేదీ తెల్లవారు జామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభిస్తామన్నారు. అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టంచేశారు. సాధారణ భక్తులకు 50 ఆర్టీసీ బస్సులు, రూ.1,000, రూ.1,500 టికెట్లు కొన్నవారికి 30 మినీ ప్రత్యేక బస్సులు పెడతామన్నారు.

టికెట్లపైనే చర్చ

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా టికెట్ల విక్రయంపైనే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తంచేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జూమ్‌ ద్వారా మీటింగ్‌లో పాల్గొని గత ఏడాది చందనోత్సవం రాత్రి 11 గంటల వరకు టికెట్లు ఇవ్వలేదని, ఈసారి మూడు రోజుల ముందుగానే జారీ చేయాలన్నారు. ఎన్ని టికెట్లు ముద్రించారు?, ఎన్ని పంపిణీ చేశారో లెక్కలు కచ్చితంగా ఉండాలన్నారు. గత ఏడాది లెక్కలు ఇప్పటికీ తేలలేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు వెలగడిపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌రాజులు మాట్లాడుతూ కలెక్టర్‌, ఈఓల చేతుల మీదుగానే టికెట్ల విక్రయాలు జరగాలన్నారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 01:30 AM