Share News

అనర్హులకు ప్రసాదాల కాంట్రాక్టు!

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:03 AM

సింహాచలం దేవస్థానంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రసాదాలు తయారుచేసే కాంట్రాక్టర్లు నిర్ణీత కాల పరిమితి లేకుండా మారిపోతున్నారు.

అనర్హులకు ప్రసాదాల కాంట్రాక్టు!

సింహాచలం దేవస్థానంలో సిత్రాలు

గతంలో టెండర్‌ ద్వారా ఒకరికి కేటాయింపు

షరతుల్లో కొన్నింటిని పాటించలేదని రద్దు

వేరొకరికి అప్పగింత

తాజాగా మరో సంస్థకు టెండర్‌ ఖరారు

ఆ సంస్థ కూడా నిబంధన మేరకు వ్యవహరించడం లేదని ఆలస్యంగా గుర్తింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రసాదాలు తయారుచేసే కాంట్రాక్టర్లు నిర్ణీత కాల పరిమితి లేకుండా మారిపోతున్నారు. ఒకరు ప్రసాదాలు తయారుచేస్తే వాటి బిల్లులు వేరొకరికి ఇస్తున్నారు. అర్హత లేనివారికి కాంట్రాక్టులు ఇస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారా?...అనేది తేల్చాల్సి ఉంది.

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారని గత ఏడాది బయటపడడంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మార్కెట్‌ ధర కంటే తక్కువ ఖరీదు నెయ్యి కొన్నట్టు తెలుసుకొని, వాటి నిల్వలు బయటకు పంపించారు. ఆ తరువాత కొన్నాళ్లు విశాఖ డెయిరీ నెయ్యి తీసుకున్నారు. మళ్లీ ఖాతా మార్చారు. ఇదిలావుంటే ప్రసాదాల తయారీ కాంట్రాక్టులను అధికారులు ఇష్టానుసారం ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు నెలల కాలంలో చాలా సిత్రాలు చోటుచేసుకున్నాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి గత నవంబరు నెలలో రెండేళ్ల కాలానికి టెండర్లు పిలిచారు. తక్కువ కోట్‌ చేసిన సంస్థకు డిసెంబరులో కాంట్రాక్టు ఇచ్చారు. మూడు నెలల తరువాత దేవస్థానం విధించిన టెండర్‌ షరతుల్లో కొన్నింటిని ఆ కాంట్రాక్టర్‌ పాటించడం లేదని గుర్తించి పక్కకు తప్పించారు. తాత్కాలికంగా మరో సంస్థతో ప్రసాదాలు తయారుచేయించారు. పాత కాంట్రాక్టర్‌ బిల్లును కూడా కొత్త కాంట్రాక్టర్‌కే ఇచ్చేశారు. అదెలా సాధ్యమైందో ప్రసాదాల తయారీ విభాగం, అక్కడి సూపరింటెండెంట్‌ చెప్పాల్సి ఉంది. ఇటీవల మళ్లీ ప్రసాదాల తయారీకి టెండర్లు పిలిచారు. ఇది కూడా రెండేళ్ల కాలానికే. ఇందులో మళ్లీ ఎల్‌-1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. గతంలో మాదిరిగానే తాజా సంస్థ కూడా కొన్ని టెండర్‌ నిబంధనలు పాటించలేదని ఆలస్యంగా గుర్తించారు. ప్రసాదాలు తయారుచేసే ఉద్యోగులకు కాంట్రాక్టు సంస్థ ఈపీఎఫ్‌, ఈఐఎస్‌ వంటివి చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి బకాయిలు లేనివారికే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ప్రసాదాలు తయారుచేస్తున్న సంస్థ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ బకాయిలు పెట్టిందనే విషయం ఇప్పుడు బయటపడింది. దాంతో ఆ విషయాన్ని దాచి పెట్టడానికి ఆ సంస్థ, సిబ్బంది కింద మీదా పడుతున్నారని తెలిసింది.

తనిఖీలు చేయకుండానే ఇస్తున్నారా?

ఏదైనా కాంట్రాక్టు ఇచ్చినప్పుడు టెండర్లలోనే షరతులు పెడతారు. ఎల్‌-1గా నిలిచిన సంస్థను ఖరారు చేసినప్పుడు ఆ నిబంధనలన్నీ పాటించారా? లేదా? టెక్నికల్‌ బిడ్‌లో పరిశీలించి ఖరారు చేయాలి. ఆరు నెలల క్రితం అలాంటివి పరిశీలించకుండా ఇచ్చినందుకు ఒకరిని తప్పించినప్పుడు, తాజాగా మళ్లీ అలాంటి తప్పు చేయడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఆ విభాగంలో ఒక అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, సూపరింటెండెంట్‌ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 01 , 2026 | 01:03 AM