Share News

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా ప్రఖర్‌ జైన్‌

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:29 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ప్రఖర్‌ జైన్‌ నియమితులయ్యారు.

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా ప్రఖర్‌ జైన్‌

టెక్నాలజీపై మంచి పట్టున్న అధికారిగా పేరు

తొమ్మిది నెలలకే తేజ్‌ భరత్‌ బదిలీ

జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఆదేశం

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ప్రఖర్‌ జైన్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం విజయవాడలో ఆర్‌టీజీఎస్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రఖర్‌ జైన్‌ బీటెక్‌ చదివారు. అనంతరం 2021 బ్యాచ్‌లో సివిల్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. మొదట కాకినాడలో ఏడాది పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత మూడు నెలలు నీతి ఆయోగ్‌కు అసిస్టెంట్‌ సెక్రటరీగా విధులు నిర్వహించారు. 2023 డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు తెనాలి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌గా 2025 ఏప్రిల్‌ వరకు సేవలు అందించారు. ఆ తరువాత రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ సీఈఓగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేసేందుకు వారధిగా మారారు. టెక్నాలజీలో మంచి పట్టున్న అధికారిగా పేరుంది.

తొమ్మిది నెలలూ పరుగులే

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా గత ఏడాది నవంబరులో బాధ్యతలు చేపట్టిన తేజ్‌ భరత్‌ సంస్థలో ఇంజనీరింగ్‌ విభాగాన్ని పరుగులు పెట్టించారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయించారు. పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, వీఎంఆర్‌డీఏ పార్క్‌, కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142, సీ హ్యారియర్‌ తదితర సందర్శనీయ ప్రాంతాలన్నింటికీ ఒకే టికెట్‌పై వెళ్లేందుకు విస్టా యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుక్కునే సౌలభ్యం కల్పించారు. అదేవిధంగా ప్లాట్ల కొనుగోలుదారులకు, ఇంజనీరింగ్‌ పనులకు వేర్వేరుగా యాప్‌లు రూపొందించారు. వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్‌కు కొత్త రూపు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. కైలాసగిరిపై త్రిశూల్‌ను సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) కోసం అవసరమైన బే సిటీ ప్రాజెక్ట్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తొమ్మిది నెలల్లో తనదైన ముద్ర కనపడేలా పనిచేశారు. వీఎంఆర్‌డీఏకు వీఈఆర్‌ బాధ్యతలు కూడా అప్పగించడంతో అదనపు అధికారులను తెప్పించారు. వారికి కీలక విభాగాలు అప్పగించారు. పనులు మరింత వేగవంతం చేయాలని భావిస్తున్న తరుణంలో ఊహించని విధంగా ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని సూచించింది.


బకాయిల కోసం ఎదురుచూపులు

ఉద్యోగులు, రిటైరైన వారికి డీసీసీబీ రూ.8 కోట్లు బకాయి

త్వరలో విడుదల చేస్తామన్న సీఈవో

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

వేతన బకాయిల కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధికారులు, ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారు ఎదురుచూస్తున్నారు. డీసీసీబీలో ప్రస్తుతం 152 మంది ఉద్యోగులు ఉన్నారు. గత నాలుగేళ్లలో 35 మంది రిటైరయ్యారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం వాణిజ్య, కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు కాలానుగుణంగా వేతన సవరణ అమలు చేయాలి. రాష్ట్రంలోని డీసీసీబీల్లో 2022 నవంబరు నుంచి వేతన స్కేళ్లు సవరించాల్సి ఉంది. కొత్త వేతన సవరణ మేరకు జీతాలు 2026 ఏప్రిల్‌ నుంచి ఇస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 2022 నవంబరు నుంచి అమలు చేయాలి. అంటే 2022 నవంబరు నుంచి 2026 మార్చి వరకు వేతనాల బకాయిలు చెల్లించాలి. విశాఖ డీసీసీబీలో 152 మంది ఉద్యోగులు, అధికారులు, 2022 నవంబరు తరువాత పదవీ విరమణ చేసిన 35 మందికి సుమారు రూ.ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎరియర్స్‌ చెల్లింపు కోసం అధికారులు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో విశాఖతో సహా రెండు, మూడు డీసీసీబీలు మాత్రమే బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయం డీసీసీబీ సీఈవో డీవీఎస్‌ వర్మ వద్ద ప్రస్తావించగా హెచ్‌ఆర్‌డీ కమిటీలో చర్చించిన తరువాత బకాయిలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే బ్యాంకు జనరల్‌ బాడీ ఆమోదం తెలిపిందన్నారు. హెచ్‌ఆర్‌డీ కమిటీ చైర్మన్‌ ఆధ్వర్యంలో త్వరలో సమావేశం నిర్వహించి ఎరియర్స్‌ మంజూరుచేస్తామన్నారు.


మాతృశాఖకు వీఎంఆర్‌డీఏ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (సీఏఓ)గా గత రెండేళ్లుగా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్‌ను మాతృశాఖ (ఆడిట్‌)కు పంపించారు. ఆయన డిప్యూటేషన్‌ ముగిసిన తరువాత ప్రభుత్వం నుంచి ఎటువంటి కొనసాగింపు ఉత్తర్వులు రాని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవల సంస్థకు చెందిన నిధులు రాజమహేంద్రవరంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన విషయంలో కొంత సమన్వయలోపం వచ్చిన నేపథ్యంలో కొనసాగింపునకు అవకాశం ఇవ్వలేదని సమాచారం.


టెట్‌కు 90.49 శాతం హాజరు

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని 11 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 3,925 మంది అభ్యర్థులకుగాను 3,552 మంది (90.49 శాతం) మంది హాజరయ్యారు. ఉదయంపూట ఆరు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,440 మందికిగాను 2,198 మంది, మధ్యాహ్నం ఐదు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1,485కు 1,354 మంది హాజరయ్యారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ మూడు కేంద్రాలను తనిఖీ చేసినట్టు డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.


రేపటి నుంచి నీతి ఆయోగ్‌ సభ్యుడి పర్యటన

మహారాణిపేట, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):

నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 9 నుంచి 12 వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. విశాఖపట్నం, అరుకు, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించి, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. 10న విశాఖలో, 11న అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.

Updated Date - Aug 08 , 2026 | 12:29 AM