‘ఉక్కు’ సీఎండీగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - May 13 , 2026 | 01:07 AM
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్- విశాఖ స్టీల్‌ప్లాంటు) సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్- విశాఖ స్టీల్‌ప్లాంటు) సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు ఉత్పత్తి రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన ఆయన ఇక్కడికి రాకముందు ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంటు ఆర్థిక సుస్థిరత, దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా పయనిస్తున్న కీలక సమయంలో ఆయన సీఎండీగా రావడం సంస్థ పురోభివృద్ధికి మరింత ఊతం ఇస్తుందని ఉక్కు వర్గాలు ఆశిస్తున్నాయి.
డైరెక్టర్ పర్సనల్ రాజీనామాకు ఆమోదం
ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఏకే బాగ్చికి అదనపు బాధ్యతలు
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు డైరెక్టర్ (పర్సనల్) రాకేశ్ నందన్ సహాయ్ రాజీనామాను కేంద్రం ఆమోదించింది. ఈ విషయాన్ని వెల్లడించకుండా ప్రస్తుతం ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉన్న ఏకే బాగ్చికి డైరెక్టర్ పర్సనల్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు బాధ్యతలు నిర్వహించేవారు ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. జీతాలు, సర్వీసు లెక్కింపు, పదోన్నతులు, బకాయిల విడుదల వంటి వ్యవహారాలపై పూర్తిస్థాయి డైరెక్టర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి, ఎంపిక చేసి, ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి
ఎన్‌టీపీసీ మానవ వనరుల విభాగంలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న రాకేశ్ నందన్ సహాయ్ గత ఫిబ్రవరి మొదటి వారంలోనే స్టీల్ పర్సనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలు నడుస్తుండడం చూసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా ఉత్పత్తి ఆధారిత జీతాలు లేవు. స్టీల్‌ప్లాంటులో దీనిని అమల్లోకి తీసుకువచ్చారు. దీనిని ఆయన తప్పుబట్టారు. ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళితే ఇబ్బంది అవుతుందని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అటు నుంచి స్పందన లేకపోవడం, ఆ తరువాత కూడా నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు అమలుచేయాల్సి రావడంతో ఆయన అదే ఫిబ్రవరి 16న తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. దీంతో అదే నెల 23వ తేదీన ‘స్టీల్ డైరెక్టర్ రాజీనామా’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. కాగా నెల రోజుల క్రితం ఆయన రాజీనామాను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదించింది. తాజాగా స్టీల్‌ప్లాంటుకు పూర్తిస్థాయి సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్‌ని నియమించడం, ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించడంతో ఆయనకు ఉద్యోగుల వ్యవహారాల్లో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఏకీ బాగ్చికి పర్సనల్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించి, రాకేశ్ నందన్ సహాయ్‌ని రిలీవ్ కావాలని ఆదేశించింది.