Share News

కరెంట్‌ కష్టాలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:36 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్‌ తీరం దాటక ముందు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా...తీరం దాటిన తరువాత కూడా పునరుద్ధరణ కాకపోవడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది.

కరెంట్‌ కష్టాలు
సీతమ్మధార ఏపీఎస్‌ఈబీ కాలనీలో కూలిన విద్యుత్‌ స్తంభాలు

తుఫాన్‌ గాలులకు

ఎక్కడికక్కడ విద్యుత్‌ వైర్లపై పడిన చెట్లు

సరఫరా పునరుద్ధరణలో జాప్యం

అంధకారంలో అనేక ప్రాంతాలు

విశాఖ జిల్లాలో 2,529 డిస్ర్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు

అనకాపల్లి జిల్లాలోనూ అదే పరిస్థితి

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్‌ తీరం దాటక ముందు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా...తీరం దాటిన తరువాత కూడా పునరుద్ధరణ కాకపోవడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. తుఫాన్‌ ప్రభావం వల్ల తీవ్రమైన గాలులు వీస్తాయని, భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో విద్యుత్‌ శాఖాధికారులు ముందు జాగ్రత్త చర్యగా అత్యధిక ప్రాంతాల్లో సోమవారం రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గాలులకు విద్యుత్‌ వైర్లు తెగిపడతాయని, వాటిని ఎవరైనా తాకితే ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా ఎక్కువ ఉంటుందని ముందస్తు చర్యలు చేపట్టారు. అదే సమయంలో గాలుల ఉధృతి పెరగడంతో మంగళవారం ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. వాటిని రెండు, మూడుసార్లు చార్జింగ్‌ చేస్తే కండక్టర్లు కట్‌ అయిపోయాయి. దాంతో వాటి పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈదురుగాలులు పెరగడంతో ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 320కి పైగా చెట్లు కూలిపోయాయి. వాటిలో కొన్ని విద్యుత్‌ వైర్లపై పడడం, ఆ బరువును తట్టుకోలేక స్తంభాలు నేలకొరగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సీతమ్మధార డాక్టర్స్‌ కాలనీ పైనున్న ఏపీఎస్‌ఈబీ కాలనీలో ఒకేచోట 12 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. సీతమ్మధార ఆక్సిజన్‌ టవర్స్‌ ముందున్న చెట్లు కూలి అక్కడి విద్యుత్‌ వైర్లపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. ఇలా చెట్లు కూలిన ప్రాంతాలన్నింటిలో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. సిబ్బంది వర్షంలోనే తడుస్తూ కూలిన చెట్లను రంపాలతో కోసి, వాటిని అక్కడి నుంచి తరలించారు. విద్యుత్‌ స్తంభాలు కొత్తవి తెచ్చి, వైర్లను మార్చి సరఫరా పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. పెందుర్తి, సుజాతనగర్‌, మురళీనగర్‌, కంచరపాలెం, ఇలా అనేక ప్రాంతాల్లో బుధవారం రాత్రి కూడా పనులు కొనసాగుతున్నాయి.

విశాఖ జిల్లాలో 619 ఫీడర్లు ఉండగా వాటిలో 26 ఫీడర్లకు సరఫరా నిలిచిపోయింది. దొండపర్తి, టౌన్‌ కొత్తరోడ్డు, ఆటోనగర్‌, చినగంట్యాడ, ఎన్‌ఏడీ జంక్షన్‌, మల్కాపురం, చిట్టివలస, బుచ్చిరాజుపాలెం, అప్పన్నపాలెం, ఎస్‌.ఆర్‌.పురం, సాగర్‌నగర్‌, ఎండాడ, చినముషిడివాడ, చీమలాపల్లి, పురుషోత్తపురం, సత్తివానిపాలెం ఫీడర్లు ఇంకా పునరుద్ధరణ కాలేదు. ఇవికాకుండా జిల్లాలో 2,529 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సమస్యలు తలెత్తాయి. వాటిలో 116 ట్రాన్స్‌ఫార్మర్లు రాత్రి ఏడు గంటల సమయానికి పనిచేయడం లేదు.

అనకాపల్లి జిల్లాలో 65 ఫీడర్లకు సరఫరా ఆగిపోయింది. రాంబిల్లి, ఎలమంచిలి, వేంపాడు, పాల్మన్‌పేట, వాడ చీపురుపల్లి, రాంకీ ఫార్మాసిటీ, నర్సింగిబిల్లి, కశింకోట, రోలుగుంట, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం మండలాల పరిధిలో ఫీడర్లకు సరఫరా నిలిచిపోయింది. అనకాపల్లి జిల్లాలో 1,524 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సమస్యలు ఏర్పడి వాటి పరిధిలో సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అల్లూరి జిల్లాలో 64 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది.

Updated Date - Oct 29 , 2026 | 01:36 AM