Share News

మాచ్‌ఖండ్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:20 AM

ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో మంగళవారం ఉత్పత్తిని ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు.

మాచ్‌ఖండ్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేత
టీపీ డ్యామ్‌ ఇనుప జాలీల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం

డ్యామ్‌ ఇనుప జాలీల వద్ద చెత్తాచెదారం పేరుకుపోయి నీటి సరఫరాకు అంతరాయం

యుద్ధప్రాతిపదికన పనులు

ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో మంగళవారం ఉత్పత్తిని ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. విద్యుదుత్పాదనకు అవసరమైన మేరకు టీపీ (టర్నల్‌ పాయింట్‌) డ్యామ్‌ నుంచి నీరు సరఫరా కాకపోవడమే అందుకు కారణంగా వెల్లడించారు. నీటి సరఫరా ఎందుకు జరగడంలేదని అధికారులు టీపీ డ్యామ్‌, సొరంగ మార్గాన్ని పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేసే ఇనుప జాలీల వద్ద చెత్తా చెదారం పేరుకు పోవడాన్ని గుర్తించారు. వెంటనే నీటి సరఫరాను, విద్యుదుత్పాదనను నిలిపివేశారు. ప్రాజెక్టు ఈఈ (జనరేషన్‌) బి.గోవిందరాజులు ఆధ్వర్యంలో చెత్తాచెదారం తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుదుత్పాదన జరుగుతోంది. అయితే టీపీ డ్యాం, కెనాల్‌లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో విద్యుదుత్పాదనకు అర్ధంతరంగా బ్రేక్‌ పడింది. మొత్తం ఆరు జనరేటర్ల సహాయంతో 120 మెగావాట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది. బుధవారం సాయంత్రం నాటికి విద్యుదుత్పాదన పునఃప్రారంభించే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Updated Date - Feb 18 , 2026 | 12:20 AM