Share News

డొంకరాయిలో విద్యుదుత్పత్తి పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:46 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించినట్టు ఏపీ జెన్‌కో ఈఈ భాస్కరరావు తెలిపారు.

డొంకరాయిలో విద్యుదుత్పత్తి పునఃప్రారంభం
వినియోగంలోకి వచ్చిన డొంకరాయి జల విద్యుత్‌ కేంద్రం

జల విద్యుత్‌ కేంద్రంలో క్యాపిటల్‌ ఓవర్హాలింగ్‌ పనులు పూర్తి

ఆరు నెలల తరువాత వినియోగంలోకి వచ్చిన యూనిట్‌

సీలేరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించినట్టు ఏపీ జెన్‌కో ఈఈ భాస్కరరావు తెలిపారు. 25 మెగావాట్ల సామర్థ్యం గల డొంకరాయి మినీ జల విద్యుత్‌ కేంద్రం యూనిట్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో ఇంజనీరింగ్‌ నిపుణులు యూనిట్‌ను పరిశీలించి క్యాపిటల్‌ ఓవర్హాలింగ్‌కు గత ఏడాది డిసెంబరులో సూచించారు. ఈ మేరకు జెన్‌కో ఉన్నతాధికారులు ఆమోదం తెలపడంతో రూ.30 లక్షల అంచనా వ్యయంతో టెండర్‌ పిలవగా, అభిరామి కంపెనీ ఈ పనులను దక్కించుకుని ఈ ఏడాది జనవరి నుంచి యూనిట్‌ ఓవర్హాలింగ్‌ పనులు ప్రారంభించింది. ఈ పనులు శుక్రవారం నాటికి పూర్తికావడంతో యూనిట్‌ను మొదటిగా 24 గంటల పాటు స్పిన్నింగ్‌లో పెట్టి అన్ని మెగ్గర్‌ వ్యాల్యూస్‌ సరిపోవడంతో ఆదివారం ఉదయం నుంచి యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. 25 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌ ద్వారా క్రమేపీ పెంచుతూ 18 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించినట్టు ఆయన తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 10:46 PM