Share News

మాచ్‌ఖండ్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:18 PM

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

మాచ్‌ఖండ్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టులో మరమ్మతు పనులు చేస్తున్న దృశ్యం

11కేవీ ఫీడర్‌లో సాంకేతిక లోపం

జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన నిలిపివేత

ముంచంగిపుట్టు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం అధిక లోడ్‌ కారణంగా 11 కేవీ లోకల్‌ ఫీడర్‌ జంపర్‌ కాలిపోయింది. దీంతో ఉదయం నుంచి విద్యుత్‌ కేంద్రంలోని మూడు జనరేటర్లు నిలిపివేశారు. ఈ కారణంగా గంటకు 51 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు శ్రమిస్తున్నప్పటికీ సాయంత్రం ఏడు గంటల వరకు ఎటువంటి ఫలితం లేకపోయింది. అలాగే గురువారం ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదాన్ని మరువక ముందే మరోసారి సాంకేతిక లోపం తలెత్తడం, విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో గత రెండు రోజులుగా ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్‌, జోలాపుట్టు కేంప్‌, సమీప గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రాంతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు ఎస్‌ఈ సీహెచ్‌ అప్పాజీ, ఇతర ఇంజినీర్లు, కార్మికులు విద్యుత్‌ పునరుద్ధరణకు శ్రమిస్తున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:18 PM