Share News

పవర్ ఫుల్

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:39 AM

గ్రామీణ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు నివారించడానికి, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, వ్యవసాయ రంగానికి నిర్ణీత వేళల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 220 కిలోవాట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు కానున్నది. ఇది అందుబాటులోకి వస్తే చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుకానున్నది.

పవర్ ఫుల్
కోమళ్లపూడిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం కేటాయించిన స్థలం

కోమళ్లపూడిలో 220 కిలోవాట్ల సామర్థ్యంతో కొత్త సబ్‌స్టేషన్‌

అంచనా వ్యయం రూ.40 కోట్లు

అన్ని కేటగిరీలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు అవకాశం

నాలుగు మండలాల్లో తీరనున్న లోఓల్టేజీ సమస్య

చోడవరం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు నివారించడానికి, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, వ్యవసాయ రంగానికి నిర్ణీత వేళల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నది. దీనిలో భాగంగా బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 220 కిలోవాట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు కానున్నది. ఇది అందుబాటులోకి వస్తే చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుకానున్నది.

వాస్తవంగా కోమళ్లపూడిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికోసం అధికారులు 10 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. అయితే భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్‌ వినియోగం, ఇతర అవసరాల దృష్ట్యా 132 కేవీ సబ్‌స్టేషన్‌ స్థాయిని 220 కేవీకి పెంచాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఇటీవల విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు, 220 కిలోవాట్ల విద్యుత్‌ స్టేషన్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం కశింకోట, నర్సీపట్నం, చీడికాడల్లో మాత్రమే 220 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. నర్సీపట్నం-చోడవరం మధ్య మరో 220 కేవీ సబ్‌స్టేషన్‌ లేకపోవడంతో చోడవరం, పరిసర ప్రాంతాలన్నింటికీ కశింకోట 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఆధారమైంది. దీనివల్ల రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, మాడుగుల మండలాల్లో విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి.

ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో వర్షాకాలంలో కూడా వ్యవసాయ విద్యుత్‌ వినియోగం అధికంగా వుంది. దీంతో సబ్‌స్టేషన్ల మీద ఒత్తిడి పెరిగి, ట్రిప్‌ అవుతున్నాయి. వ్యవసాయ రంగానికి నిర్ణీత వేళల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడంతోపాటు ఇతర కేటగిరీల వినియోగదారులకు కూడా లోఓల్టేజీ సమస్యల లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి కోమళ్లపూడిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు ఎంతో అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

త్వరలో మరో రెండుచోట్ల 220 కేవీ సబ్‌స్టేషన్లు

ఎ.ప్రసాద్‌, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్‌

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో విద్యుత్‌ సరఫరాను మెరుగుపరిచేందుకు కొత్తగా 220 కేవీ విద్యుత్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి, కె.కోటపాడులో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు తగ్గి, మరింత మెరుగ్గా విద్యుత్తును సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది.

Updated Date - Oct 10 , 2026 | 12:39 AM