పవర్ డిమాండ్ పీక్స్...
ABN , Publish Date - May 23 , 2026 | 12:34 AM
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఏడు గంటలైనా వడగాడ్పులు తగ్గడం లేదు.
ఎండలు మండిపోతుండడంతో భారీగా వినియోగం
వేయి మెగావాట్లు దాటిన వైనం
గత ఏడాదితో పోలిస్తే 150 మెగావాట్లు అధికం
సర్కిల్ కార్యాలయంలో 24/7 మానటరింగ్ సెల్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఏడు గంటలైనా వడగాడ్పులు తగ్గడం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప జనాలు బయటకు రావడం లేదు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇళ్లలో కూడా ఫ్యాన్ల నుంచి కూడా వేడిగాలులు వస్తున్నాయి. ఏసీ ఉన్నవారు బిల్లు గురించి భయపడకుండా ఉదయం 11 గంటలకే ఆన్ చేస్తున్నారు. ఏసీలను 24 డిగ్రీల వద్ద ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నా ఆ కూలింగ్ సరిపోక చాలామంది 16 నుంచి 18 డిగ్రీల వద్ద పెట్టుకొని ఉపశమనం పొందుతున్నారు.
ఇక వాణిజ్య సంస్థల విషయానికి వస్తే షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లలో సందర్శకులు, కొనుగోలుదారులు, ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉన్నా సరే ఏసీలు నిరంతరం ఉపయోగించాల్సి వస్తోంది. ఇంట్లో ఏసీ సదుపాయం లేని కొందరు ఏ థియేటర్‌లో ఏసీ బాగుంటుందో చూసుకొని అక్కడకు వెళుతున్నారు. మ్యాట్నీ షోలకు ఈ తరహా ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్నారు.
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
గత ఏడాది (2025) మే నెలలో విశాఖపట్నం సర్కిల్ (జిల్లా)లో విద్యుత్ డిమాండ్ సగటున 750 మెగావాట్లు. అత్యధికంగా 13వ తేదీన 889 మెగావాట్లు దాటింది. ఆ రోజున వినియోగదారులు 17.41 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడారు. 10వ తేదీన డిమాండ్ 888 మెగావాట్లు నమోదైంది. ఆ రోజు 17.25 మిలియన్ యూనిట్లు ఉపయోగించారు. 4వ తేదీన అత్యల్పంగా 619 మెగావాట్లే డిమాండ్ ఉంది. ఆ రోజు 12.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు.
ఈ ఏడాది మే నెలను గమనిస్తే విద్యుత్ డిమాండ్ వేయి మెగావాట్లు దాటిపోయింది. ఈ నెలలో గత 21 రోజుల్లో ఆరుసార్లు వేయి మెగావాట్లు దాటి డిమాండ్ నమోదైంది. ఇంకో పది రోజులు 900 మెగావాట్లు దాటింది. ఇంకో నాలుగు రోజులు 890 మెగావాట్లు దాటింది. అంటే గత ఏడాది కంటే సగటు డిమాండ్ 150 మెగావాట్లు ఎక్కువైంది. గణాంకాల ప్రకారం చూసుకుంటే వేయి మెగావాట్ల విద్యుత్ వినియోగించే నగరాల్లో విశాఖపట్నం కూడా చేరింది.
ఉష్ణోగ్రతలు...వినియోగం ఎలా ఉందంటే...
విశాఖపట్నంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయి. జిల్లాలో గురువారం అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ములగాడలో అత్యధికంగా 45.2 డిగ్రీలు, విశాఖ రూరల్‌లో 44.6, మహారాణిపేట, పద్మనాభం, సీతమ్మధార, పెదగంట్యాడల్లో 44.1 డిగ్రీలు నమోదైంది. పెందుర్తిలో 41, గోపాలపట్నంలో 40.5, ఆనందపురంలో 40.3 డిగ్రీలు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం నగరంలో విద్యుత్ డిమాండ్ 1,014 మెగావాట్లు దాటింది. 20.43 మిలియన్ యూనిట్లు వాడేశారు. గత ఏడాది ఇదేరోజున వాడిని విద్యుత్‌తో పోలిస్తే 72.8 లక్షల యూనిట్లు అధికం.
24/7 మానటరింగ్ సెల్
శ్యాంబాబు, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్
ఎండల వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అయిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకని అలాంటి సమస్య గుర్తించిన వెంటనే దానిని సరిచేయడానికి ప్రతి సెక్షన్‌లో నలుగురిని అందుబాటులో ఉంచాం. వారు 24/7 పనిచేస్తారు. ఇలా మొత్తం 1,500 మంది క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యాబాగ్‌లోని సర్కిల్ కార్యాలయంలో మానటరింగ్ సెల్ కూడా ఏర్పాటుచేశాం. ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం 43 సెక్షన్లలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాం. విద్యుత్ కొరత లేదు. నిరంతరం సరఫరా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
మే నెలలో అత్యధిక విద్యుత్ వినియోగం
------------------------------------------------------------------------
తేదీ ఈ ఏడాది వినియోగం గత ఏడాది
-------------------------------------------------------------------------
మే 5 19.24 మి.యూనిట్లు 13.81 మి.యూనిట్లు
6 19.26 మి.యూనిట్లు 15.89 మి.యూనిట్లు
7 19.37 మి.యూనిట్లు 16.46 మి.యూనిట్లు
8 19.29 మి.యూనిట్లు 17.37 మి.యూనిట్లు
13 19.48 మి.యూనిట్లు 17.41 మి.యూనిట్లు
14 19.35 మి.యూనిట్లు 17.02 మి.యూనిట్లు
18 19.37 మి.యూనిట్లు 13.76 మి.యూనిట్లు
19 19.59 మి.యూనిట్లు 13.19 మి.యూనిట్లు
20 20.68 మి.యూనిట్లు 13.02 మి.యూనిట్లు
21 20.43 మి.యూనిట్లు 13.15 మి.యూనిట్లు
-------------------------------------------------------------------------