Share News

సీలేరులో 13 గంటలు పవర్‌ కట్‌

ABN , Publish Date - Jul 31 , 2026 | 10:43 PM

సీలేరులో 13 గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం స్విచ్‌యార్డులో గల 33/11 ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద సాంకేతిక లోపం తలెత్తి శుక్రవారం తెల్లవారు 3 గంటలకు విద్యుత్‌ సరఫరా ఆగింది.

సీలేరులో 13 గంటలు పవర్‌ కట్‌
ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్న జెన్‌కో సిబ్బంది

అంధకారంలో పలు కాలనీలు

స్విచ్‌యార్డులోని ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం

సరి చేసేందుకు 13 గంటలు పట్టిందన్న జెన్‌కో ఈఈ

సీలేరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి):

సీలేరులో 13 గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం స్విచ్‌యార్డులో గల 33/11 ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద సాంకేతిక లోపం తలెత్తి శుక్రవారం తెల్లవారు 3 గంటలకు విద్యుత్‌ సరఫరా ఆగింది. దీంతో సీలేరు, చింతపల్లిక్యాంప్‌, టీఆర్‌సీ క్యాంప్‌, పార్వతీనగర్‌, బూసికొండ, శాండ్‌క్వారీ, వలసగెడ్డ కొత్తూరు, వలసగెడ్డ కాలనీలు అంధకారంలోకి వెళ్లాయి. సీలేరు జెన్‌కో ఆపరేషన్‌ ఈఈ రాజేంద్రప్రసాద్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.

సీలేరులో శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో జలవిద్యుత్‌ కేంద్రం స్విచ్‌ యార్డులో జంపర్లు తెగిపోయి ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ కావడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి తెగిపడిన జంపర్లను తొలగించి, కొత్తవి అమర్చి ట్రాన్స్‌ఫార్మర్‌లో లీకైన ఆయిల్‌ను సరిచేయడానికి 13 గంటల సమయం పట్టింది. అన్ని సక్రమంగా ఉన్నాయా.. లేదా.. అని సరిచూసుకొని సాయంత్రం 4 గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామని ఈఈ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో సీలేరు ప్రాంతవాసులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బ్యాంక్‌, పోస్టల్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో పలు సేవలు నిలిచిపోయాయి. ఏపీఆర్‌ స్కూల్‌, బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యుత్‌ సరఫరా లేక విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 10:43 PM