మన్యంలో కుండపోత
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:59 PM
పాడేరు మన్యంలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గూడెంకొత్తవీధి, ముంచంగిపుట్టు మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది.
జీకేవీధి, ముంచంగిపుట్టులో భారీ వర్షం
చాపగెడ్డ రోడ్డుకడ్డంగా పడిన వృక్షం
గంటపాటు రాకపోకలకు అంతరాయం
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం గంటన్నరపాటు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాసింది. రెండు గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలకు వర్షపు నీరు చేరుకున్నది. వర్షానికి చాపగెడ్డ వద్ద రహదారికి అడ్డంగా భారీ వృక్షం పడింది. దీంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు స్థానిక గిరిజనుల సహకారంతో వృక్ష శకలాలను తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.
ముంచంగిపుట్టులో..
మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాసింది. దీంతో ఎండ వేడికి ప్రజలు విలవిలలాడిపోయారు. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులుతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు చిత్తడైపోయాయి. మట్టి రహదారులు బురదమయంగా మారాయి. గత కొద్ది రోజులుగా సాయంత్రం అయితే చాలు వర్షం కురుస్తున్నది. దీంతో ఎండ వేడికి ఆపసోపాలు పడుతున్న ప్రజలు వర్షానికి చల్లబడటంతో కాస్త ఉపశమనం పొందారు.