Share News

మన్యంలో కుండపోత

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:23 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి మన్యంలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా ఒడిశాకు సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మన్యంలో కుండపోత
చింతపల్లిలో కురుస్తున్న వర్షం

సాయంత్రం నుంచి కురిసిన వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

పాడేరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి మన్యంలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని దాదాపుగా ఒడిశాకు సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజా వాతావరణంతో వృద్ధులు, పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముందని వైద్యులు అంటున్నారు. అలాగే ప్రస్తుత వాతావరణంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చింతపల్లిలో..

మండలంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాసింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి నల్లని మేఘాలు ఆకాశంలో ఆవిష్కృతమయ్యాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకున్నాయి.

అరకులోయలో..

అరకులోయలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం పడింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షం గంటకు పైగా కురిసింది. ఉదయం నుంచి మబ్బు వాతావరణం నెలకొని సాయంత్రం అయ్యేసరికి వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. కొంత విరామం అనంతరం తిరిగి రాత్రి 7.30 నుంచి వర్షం కురుస్తున్నది.

ముంచంగిపుట్టులో..

మండలంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. సాయంత్రం భారీ ఈదురు గాలులు వీచాయి. రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఉదయం వేళల్లో ఎండ కాస్తుండగా.. సాయంత్రం వర్షం పడుతున్నది. అకాల వర్షాల కారణంగా జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో వరదనీరు వచ్చి చేరుతున్నది.

కొయ్యూరులో..

మండలంలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇంకా వర్షం పడుతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Updated Date - Mar 20 , 2026 | 11:23 PM