Share News

కుండపోత

ABN , Publish Date - May 01 , 2026 | 11:15 PM

ద్రోణి ప్రభావంతో మన్యంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

కుండపోత
పాడేరులో శుక్రవారం రాత్రి కురుస్తున్న వర్షం

భారీ వర్షంతో చల్లబడిన మన్యం

ముంచంగిపుట్టులో గాలివాన బీభత్సం

బూసిపుట్టులో ఎగిరిపడ్డ మూడు ఇంటి పైకప్పులు

ఉపశమనం పొందిన గిరిజనం

పాడేరు, మే 1(ఆంధ్రజ్యోతి): ద్రోణి ప్రభావంతో మన్యంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో గత కొన్నిరోజులు పొగమంచు, వర్షం జాడే లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రంగా ఎండ కాస్తున్నది. శుక్రవారం అందుకు భిన్నంగా జిల్లా కేంద్రం మొదలుకుని ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ముసురు వాతావరణం నెలకొని రాత్రి ఏడు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండకు అల్లాడుతున్న జనం తాజా వర్షంతో ఉపశమనం పొందారు.

అరకులోయలో 37.2 డిగ్రీలు

ఏజెన్సీలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయలో 37.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా కొయ్యూరులో 36.5, జి.మాడుగులలో 35.1, అనంతగిరిలో 34.0, పెదబయలులో 33.4, హుకుంపేటలో 32.7, చింతపల్లిలో 32.0 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపట్టు మండలంలో పలు చోట్ల శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగమన్నాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. రహదారులు చిత్తడైపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో భారీ ఈదురుగాలులకు మఠం చలపతి, కిల్లో బలరాం, కంచం గంగన్న ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో ఉండే నిత్యావసర సరకులు, పలు సామాన్లు దెబ్బతిన్నాయి.

అరకులోయలో..

అరకులోయలో శుక్రవారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. పగలు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

హుకుంపేటలో..

మండలంలోని శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వేసవి ఎండలకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం వర్షానికి ఉపశమనం పొందారు. ఈ వర్షం వేరుశనగ పంటకు అనుకూలమని రైతులు తెలిపారు.

పెదబయలులో..

మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. దీంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం 5 గంటల తరువాత వాతావరణంలో మార్పులు ఏర్పడి పెద్ద శబ్దాలతో పిడుగులు పడ్డాయి. అనంతరం ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - May 01 , 2026 | 11:15 PM