Share News

గుంతలు.. పర్యాటకులకు చింతలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:20 PM

సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రాగుహల అందాలను తిలకించాలంటే.. ముందుగా ప్రమాదాలను తప్పించుకోవాల్సిన పరిస్థితి పర్యాటకులకు ఏర్పడింది. అడుగడుగునా గుంతలను తప్పించుకుని ప్రయాణిస్తే తప్ప బొర్రాగుహలకు చేరుకోలేకపోతున్నామని పర్యాటకులు మండిపడుతున్నారు.

గుంతలు.. పర్యాటకులకు చింతలు
బొర్రా-గేటువలకు మధ్యలోని కొట్టుకుపోయిన రోడ్డు

బొర్రాగుహలకు వెళ్లాలంటే ఎన్ని పాట్లో..

అడుగడుగునా రోడ్లుపై గోతులు

ప్రమాదాలకు గురవుతున్న సందర్శకులు

అధ్వానంగా ఏడు కిలోమీటర్ల రహదారి

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

అనంతగిరి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు వెళ్లే రోడ్డంతా పూర్తిగా అధ్వానంగా మారింది. ములియగుడ నుంచి మొదలుకొని బగ్మారవలస, దొరగూడ, గేటువలస, బొర్రా వరకు రోడ్డంతా గోతులమయమైంది. ఈ కారణంగా రాకపోకలకు పర్యాటకులతోపాటు కోనాపురం, బొర్రా పంచాయతీలకు చెందిన 20 గ్రామాల గిరిజనులు ప్రతిరోజూ నరకాన్ని అనుభవిస్తున్నారు. బొర్రాగుహలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వాహనాల్లో భారీగా తరలివస్తుంటారు. అయితే దొరగూడ సమీపంలోని మలుపు నుంచి వారికి గుంతల కష్టాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా దొరగూడ మలుపు వద్ద ఏర్పడిన గుంత కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించే క్రమంలోని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఐదేళ్లుగా బొర్రా రోడ్డుకు కనీస మరమ్మతులు, నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా పాడైపోయింది. పలుచోట్ల బీటీ రోడ్డు ఆనవాళ్లు లేకపోవడంతో పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. అయినా ఆర్‌అండ్‌బీ అధికారుల్లో కనీసం చలనం లేకపోవడంతో పర్యాటకులు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

ఆ ఏడు కిలోమీటర్లు నరకం

ములియగుడ నుంచి బొర్రాగుహల వరకు సుమారు ఏడు కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. బగ్మారవలస, దొరగుడ, హోటల్స్‌ సమీపంలోని రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. రైల్వేగేటు సమీపంలోని రక్షణగోడ కూలిపోవడంతో వచ్చే వాహనాలు అదుపు తప్పితే 80 అడుగుల లోయలోకి దూసుపోయే ప్రమాదం ఉంది. గతంలోని రెండు ప్రమాదాలు జరిగాయి. వ్యాన్‌ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌ మృతిచెందాడు. దానికి ముందు లారీ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌కు కాలు విగిరిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని పర్యాటక ప్రాంతాలకు వస్తే ప్రమాదాల బారిన పడుతున్నామని సందర్శకులు మండిపడుతున్నారు.

బొర్రా, కోనాపురం పంచాయతీలకు ప్రధాన రహదారి

బొర్రా, కోనాపురం పంచాయతీల పరిధిలోని బొర్రా, పెద్దూరు, ఎగువమామిడి, జీరుగెడ్డ, నీనిమామిడి, పూలుగుడ, కొయిటిగూడ, కరాయిగుడ, చప్పాడి, కోనాపురం, అతిమాల, కితలింగి, బొండ్యగూడ, లిడ్డంగి, సారాగూడ తదితర గ్రామాల ప్రజలు ములియగుడ, బొర్రా గేటువలస మీదుగా ఆయా గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం అధ్వానంగా ఉన్న రోడ్డు కారణంగా ప్రజలు రాకపోకలకు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోకి వస్తుంది. కనీసం మరమ్మతులపై ఆ శాఖ దృష్టి సారించకపోవడంతో గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు గుంతల్లో మెటల్‌ వేసి వదిలేయడంతో వర్షాలకు కొట్టుకుపోయింది. కాంక్రీట్‌ వేసి ఉంటే రోడ్డుపై కొంతవరకు అయినా గుంతల బాధలు తప్పేవని పర్యాటకులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు స్పందించి బొర్రా రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేసి, ప్రమాదాలు నివారించేలా చర్యలు చేపట్టాలని పర్యాటకులు, గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 10:20 PM