Share News

చిలకడ దుంప దిగుబడులు అదుర్స్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:11 PM

గిరిజన గ్రామాల్లో ఆదివాసీ రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన చిలకడ దుంప నూతన వంగడం సాగు మంచి ఫలితాలనిచ్చింది.

చిలకడ దుంప దిగుబడులు అదుర్స్‌
చిలకడ దుంపలను విక్రయానికి సిద్ధం చేస్తున్న రైతులు

ఫలించిన నూతన వంగడం ప్రయోగాత్మక సాగు

రెట్టింపు దిగుబడులు సాధించిన గిరిజన రైతులు

వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెంపునకు కేవీకే శాస్త్రవేత్తల కార్యాచరణ

చింతపల్లి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో ఆదివాసీ రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన చిలకడ దుంప నూతన వంగడం సాగు మంచి ఫలితాలనిచ్చింది. హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారంతో నూతన వంగడాలను సాగు చేసిన గిరిజన రైతులు నాణ్యమైన రెట్టింపు దిగుబడులు సాధించారు. బీసీటీ కేవీకే శాస్త్రవేత్తలు ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1 రకం విత్తనాన్ని చింతపల్లి మండలంలోని అభ్యుదయ రైతులకు రెండేళ్లుగా పంపిణీ చేస్తున్నారు. నాట్లు వేసిన నాటి నుంచి దిగుబడులు పొందే వరకు శాస్త్రవేత్తలు రైతులకు సాగులో మెలకువలను తెలియజేస్తూ సాంకేతిక సహకారం అందించారు. ఈ ఏడాది ఎకరానికి సాధారణ దిగుబడి కంటే అధిక దిగుబడులు సాధించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆదివాసీ రైతులు 20 ఏళ్లుగా వాణిజ్య సరళిలో సుమారు మూడు వేల ఎకరాల్లో చిలకడ దుంపను సాగు చేస్తున్నారు. రైతులు దీనిని సంప్రదాయేతర పంటగా గిరిజన ప్రాంతంలో పండిస్తున్నారు. ప్రతి ఏటా జూలైలో పంట పొలాలను సిద్ధం చేసుకుని బెడ్స్‌పై నాట్లు వేశ్తారు. ఈ పంట కాలం మూడు నెలలు. నవంబరు, డిసెంబరులో దిగుబడులు వస్తాయి. గిరిజన రైతులు కొన్నేళ్లుగా సాగు చేస్తున్న సంప్రదాయ దేశవాళీ రకం చిలకడ దుంప బాగా పండితే ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి. కేవీకే శాస్త్రవేత్తలు పంపిణీ చేసిన ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1 రకం నాట్లు వేసుకున్న రైతులు ఎకరానికి 8- 9 క్వింటాళ్ల దిగుబడి సాధించారు.

నాణ్యమైన దిగుబడులు

కేవీకే శాస్త్రవేత్తల సహకారంతో గిరిజన రైతులు సాగు చేసిన ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1 రకం చిలకడ దుంప సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించారు. ఈ రకం దుంప పరిమాణం పెద్దగా, పొడవుగా ఉంటుంది. ఒకే దుంప చుట్టూ గుత్తులుగా దుంపలు ఊరుతున్నాయి. దుంప పరిమాణం ఆకర్షణీయంగా ఉండడంతో మార్కెట్‌లో అధిక ధర లభిస్తున్నది. ఈ పంట 100 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఈ దుంపలతో ఆల్కహాల్‌ తయారు చేస్తారు. మార్కెట్‌లో బస్తా(50 కిలోలు) రూ.1000- 1200 ధర పలుకుతుంది.

మెండుగా పోషకాలు

ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1 చిలకడ దుంపలో మెండుగా పోషక విలువలు ఉన్నాయి. వంద గ్రాముల చిలకడ దుంపలో శక్తి 86 క్యాలరీలు, కార్బోహైడ్రెట్లు 20.1 గ్రాములు, ఫైబర్‌ 3.0 గామ్రులు, చక్కెర 4.2 గ్రాములు, ప్రొటీన్‌ 1.6 గ్రాములు, విటమిన్‌-సీ 2.4 మిల్లీ గ్రాములు, పొటాషియం 337 మిల్లీ గ్రాములు, క్యాల్షియం 30 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 25 మిల్లీ గ్రాములు, ఫాస్పరస్‌ 47 మిల్లీ గ్రాములు, సోడియం 55 మిల్లీ గ్రాములు, ఇనుము 0.6 మిల్లీ గ్రాములు ఉంటుంది. అధిక పోషక విలువలు కలిగి ఉండడంతో ఆర్‌ఎన్‌ఎస్‌పీ- చిలకడ దుంపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

Updated Date - Jan 01 , 2026 | 11:11 PM