Share News

నర్సీపట్నంలో మళ్లీ వాయిదా

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:13 AM

మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మంగళవారం కూడా వాయిదా పడింది. మునిసిపాలిటీలో 40 మంది కౌన్సిలర్లకుగాను జనసేనకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేకపోతున్నట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించి, సమావేశాన్ని వాయిదా వేశారు.

నర్సీపట్నంలో మళ్లీ వాయిదా
కౌన్సిల్‌ హాలులో జనసేన కౌన్సిలర్లు

టీడీపీ, స్వతంత్ర కౌన్సిలర్లు రెండో రోజూ గైర్హాజరు

కోరం లేకపోవడంతో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించని ప్రిసైడింగ్‌ అధికారి

నర్సీపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నిక మంగళవారం కూడా వాయిదా పడింది. మునిసిపాలిటీలో 40 మంది కౌన్సిలర్లకుగాను జనసేనకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించలేకపోతున్నట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించి, సమావేశాన్ని వాయిదా వేశారు.

నర్సీపట్నం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రమాణస్వీకారంతోపాటు వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం ప్రిసైడింగ్‌ అధికారి వీవీ రమణ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టే సమయానికి టీడీపీ, స్వతంత్ర కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. వైస్‌ చైర్మన్‌ పదవికి జనసేన నుంచి కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య బీ ఫారం అందించారు. కానీ ఎన్నిక నిర్వహించడానికి అవసరమైనంత మంది సభ్యులు లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో మంగళవారం ఉదయం పది గంటలకు జనసేన కౌన్సిర్లు అద్దేపల్లి సౌజన్య, సురకాసుల గోపి, ఆదపురెడ్డి రామకృష్ణ సమావేశ మందిరానికి వచ్చారు. 11 గంటల తర్వాత 10వ వార్డు కౌన్సిలర్‌ రావాడ లక్ష్మి (టీడీపీ) వచ్చి కొద్దిసేపు కుర్చొని, రిజిస్టర్‌లో సంతకం పెట్టి బయటకు వెళ్లిపోయారు. తర్వాత 7వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ కరణం అమ్మాజీ వచ్చారు. కానీ ఆమె కౌన్సిల్‌ హాలులో ఎక్కువ సేపు వుండలేదు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహణ కోసం ప్రిసైడింగ్‌ అధికారి వీవీ రమణ, మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర రెండు గంటలపాటువేచి చూశారు. మిగిలిన సభ్యులు రాకపోడంతో సుమారు ఒంటిగంట సమయంలో ప్రిసైడింగ్‌ అధికారి రమణ మీడియాతో మాట్లాడారు. మొత్తం 40 మంది కౌన్సిలర్లకుగాను ఐదుగురు మాత్రమే హాజరయ్యారని, కోరం లేకపోవడంతో వైస్‌చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. జనసేన వైస్‌చైర్మన్‌ అభ్యర్థి అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ, జనసేన పార్టీ పెద్దలు, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారని, ఇంతకు మించి తనకేమీ తెలియదని అన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 01:14 AM