పశు సంవర్ధక శాఖలో పోస్టుమార్టం
ABN , Publish Date - May 19 , 2026 | 12:47 AM
సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నియమితులైన పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకుల ధ్రువపత్రాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
సచివాలయాల్లో పశు సంవర్ధక శాఖ గ్రామ సహాయకుల ధ్రువపత్రాలపై విచారణ
కొంతమంది బోగస్ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వ నిర్ణయం
ఉమ్మడి జిల్లాలో 371 మంది
అందులో 335 మంది వద్ద సర్టిఫికెట్లు సేకరణ
ఆయా విద్యా సంస్థలకు పంపాలని నిర్ణయం
అదే శాఖలో పనిచేస్తూ పరీక్ష రాసిన మరో 46 మందికి షోకాజ్
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నియమితులైన పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకుల ధ్రువపత్రాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొంతమంది బోగస్ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో గల పశు సంవర్ధక శాఖ సహాయకులందరి ధ్రువపత్రాలు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,300కుపైగా గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అయితే పశువులు ఎక్కువగా ఉండే గ్రామాల పరిధిలో ఉన్న 371 సచివాలయాల్లోనే పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయక పోస్టులు మంజూరుచేశారు. ఈ పోస్టుకు రెండేళ్ల యానిమల్ అసిస్టెంట్ డిప్లమో కోర్సు చదివిన అభ్యర్థులను అర్హులుగా పరిగణించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల్లోని కళాశాలల ధ్రువపత్రాలతో అభ్యర్థులు పరీక్షలు రాసి పశుసంవర్ధక శాఖ సహాయకులుగా ఎంపికయ్యారు. అప్పట్లో అభ్యర్థుల కొరత కారణంగా రాత పరీక్షలో ఒకటి, రెండు మార్కులు వచ్చిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అయితే కొందరు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విచారణకు ఆదేశించింది. ప్రతి ఒక్కరి ధ్రువపత్రం వారు చదివిన కళాశాలకు పంపి నిర్ధారించుకోవాలని పశు సంవర్ధకశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పశు సంవర్ధకశాఖ గ్రామ సహాయకులందరు ధ్రువపత్రాలు పంపాలని విశాఖ జిల్లా పశు సంవర్ధకశాఖ ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 371 మంది పశుసంవర్ధక శాఖ గ్రామ సహాయకుల్లో 335 మంది నుంచి ధ్రువపత్రాలు సేకరించారు. ఆ ధ్రువపత్రాలను ఆయా విద్యా సంస్థలకు పంపాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. మిగిలిన 46 మంది పశుసంవర్ధకశాఖ గ్రామ సహాయకులు గతంలో ఇదేశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా, గోపాలమిత్రలుగా పనిచేసేవారు. వారంతా సర్వీస్‌లో ఉండగా డిప్లమో కోర్సు చదివినట్టు సచివాలయ ఉద్యోగానికి దరఖాస్తు సమయంలో ధ్రువపత్రాలు జత చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నత చదువులు చదివితే సదరు కాలానికి సెలవు తీసుకోవాలి. అయితే ఆ 46 మంది సెలవు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. అది ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధం కావడంతో 46 మందికి షోకాజ్ జారీచేశారు. విధులు నిర్వహిస్తూనే యానిమల్ అసిస్టెంట్ డిప్లమో కోర్సు చదివామంటూ వారంతా వివరణ ఇచ్చారని తెలిసింది. ఈ విషయం విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రెడ్డి నీలయ్య వద్ద ప్రస్తావించగా ఉమ్మడి జిల్లాలో 371 మంది పశుసంవర్ధకశాఖ గ్రామ సహాయకుల ధ్రువపత్రాలు పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వీరిలో 335 ధ్రువపత్రాలను ఆయా కళాశాలలకు త్వరలో పంపుతామని, 46 మందికి షోకాజ్ ఇచ్చామన్నారు. వారు ఇచ్చిన వివరణను ప్రభుత్వానికి పంపామన్నారు.